పోలీస్ కమిషనరేట్ కు చేరిన ప్రెస్ క్లబ్ పంచాయతీ
హనుమకొండ క్రైమ్,(విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ నిధుల దుర్వినియోగంపంచాయతీ చిలికి చిలికి మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని చేరింది. ప్రెస్ క్లబ్ బాధ్యులు, జిల్లా నాయకులు మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీతి సింగ్ కు నిధుల దుర్వినియోగం, రికవరీ పై వినతిపత్రం అందించారు. ప్రెస్ క్లబ్ నిధులను దుర్వినియోగం చేసిన క్లబ్ పూర్వ అధ్యక్ష,కార్యదర్శి తుమ్మ శ్రీధర్ రెడ్డి, పెరుమాండ్ల వెంకటేశ్వర్లులపై సుబేదారి పోలీస్ స్టేషన్లో గతంలో ఫిర్యాదు చేయటంతో అట్టి ఫిర్యాదుపై సుబేదారి పీఎస్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 206/2024 కేసు నమోదైందని కానీ వారి నుండి సొమ్ము రికవరీ చేయకపోవటం, చట్టపరమైన చర్యలు తీసుకోకపోవటంతో సదరు అభ్యర్థులు క్లబ్ సభ్యులను తప్పుదోవ పట్టించేలా ప్రవర్తిస్తూ, తప్పుడు ప్రకటనలు చేస్తూ ఇష్టారీతిన పలువురు సభ్యులను చాటుమాటుగా దుర్భాషలాడుతున్నారన్నారు.
సిపిని కలిసి ప్రెస్ క్లబ్ సభ్యులకు సంబంధించిన సొమ్మును దిగమింగిన వారి నుండి రికవరీ చేసి జర్నలిస్టులకు తగిన న్యాయం చేయగలరని కోరారు. దసరాలోగా దుర్వినియోగమైన నిధులను రికవరీ చేసి క్లబ్ కు జమచేస్తే ఆ డబ్బులను దసరా పండగకు ప్రెస్ క్లబ్ గౌరవ సభ్యులకు కానుకగా అందిచనున్నామని సీపీకి వివరించారు. కేసు విచారణ పురోగతి విషయంలో నిందితులకు పరోక్ష సహాకారం అందించిన పోలీసు అధికారులపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు విచారణను ఐపిఎస్ అధికారికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ నాటికి క్లబ్ లో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులు పూర్తిచేసేందుకు నిర్ణయించామని వివరించారు. కాగా నిధులు దుర్వినియోగం చేసిన వ్యక్తులు క్లబ్ లో ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని, అభివృద్దికి అడ్డుపడుతున్నారని, తక్షణమే నిధులు రికవరీ చేయించాలని కోరారు. ఈ వినతిపై కమిషనర్ సానుకూలంగా స్పందించి తక్షణమే పోలీసు అధికారులను కేసు దర్యాప్తు చేయాలని ఆదేశించారు.






