2 August, 2026 | 5:10 AM

యూరియా తెచ్చిన తిప్పలు... అవస్థలు పడుతున్న రైతులు

03-09-2025 12:09 AM

గార్ల (మహబూబాబాద్), సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) : మహబూబాబాద్ జిల్లా, గార్ల -బయ్యారం మండలాల్లో విపరీతమైన యూరియా కొరతతో రైతన్నలు అవస్థలు పడుతున్నారు. ఉదయం నాలుగు గంటల నుండి గార్ల మండల పరిధిలోని ముల్కనూర్ గ్రామపంచాయతి కార్యాలయం ఎదుట టోకెన్ల కొరకు వేచి ఉన్నారు.

రెండు సంచుల యూరియా కోసం ఉదయం ఉండి రాత్రి వరకు పడి గాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయ్యారం మెయిన్ రోడ్డు పై యూరియా కోసం రైతులు బైటాయించారు. వ్యవసాయ ధికారి రాంజీని రైతులు నిలదీశారు. సుమారుగా రెండు గంటల పాటు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. రైతులకు సాంఘిభావంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు గౌని ఐలయ్య, మాజీ జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, జగ్గన్న, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

చిట్యాలలో..

చిట్యాల, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) : యూరియా కోసం రైతులు అరి గోస పడుతున్నారు. రాత్రనకా పగలనకా విక్రయ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించు కోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. అదను దాటుతున్న పంటకు వేసేందుకు యూరియా సరిపడా దొరకడం లేదని వాపోతున్నారు.

మంగళవారం చిట్యాల మండల కేంద్రంలోని రైతు సేవా సమితి కేంద్రం వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరి నిరీక్షిస్తున్నారు.మండల కేంద్రానికి ఒక లోడు యూరియా మాత్రమే రాగ అంతకుమించి రైతులు రావడంతో అక్కడ గందరగోళం నెలకొంది.వ్యవసాయ పనులు మానుకుని రైతులు కేంద్రం వద్ద క్యూలో పడిగాపులు కాస్తున్నారు. సరిపడా యూరియాను తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు.

మహదేవపూర్‌లో..

మహదేవపూర్, (భూపాలపల్లి) సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో యూరియా కొరతతో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో సరఫరా చేస్తున్న యూరియా గోదాం వద్దకు వచ్చి వర్షంలో తడుస్తూ మహిళా రైతులు యూరియా ఇవ్వడం లేదని ఉదయం నుండి వేచి చూస్తున్నారు.

అనంతరం రైతులు ఎక్కువ సంఖ్యలో రావడంతో సహకార సంఘం సిబ్బంది పోలీసుల ఆధ్వర్యంలో ప్రతి రైతుకు ఒక బస్తా యూరియా చొప్పున పంపిణీ చేశారు. రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరా సకాలంలో పంపిణీ చేయకపోవడంతో  తమ పంటలు ఎండిపోతున్నా యని వాపోయారు. ప్రభుత్వం సకాలంలో యూరియా పంపిణీ చేయాలని కోరారు.