ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట
న్యూఢిల్లీ, మే 28: మీ బ్యాంక్ ఖాతాలు మోసగాళ్లబారినపడి దుర్వినియోం కాకుండా, అనధికార లావాదేవీలు జరక్కుండా పలు బ్యాంక్‌లు ఇటీవల ఒక కొత్త సేఫ్టీ ఫీచర్‌ను తీసుకొచ్చాయి. ఈ ఫీచర్‌లో మీ బ్యాంక్ ఖాతా ద్వారా జరిగే ఎటువంటి అసాధారణ, అనుమానాస్పద లావాదేవీనైనా బ్యాంకులు అనుమతించేముందు, మీకు వెనువెంటనే ఒక అలర్ట్ పంపిస్తాయి. మీకు ఈ అలర్ట్ చేరిపుడు మీకు రెండు ఆప్షన్లు కన్పిస్తాయి. ఆ లావాదేవీకి మీరు అనుమతించవచ్చు లేదా నిరాకరించవచ్చు. ఇప్పటివరకూ లావాదేవీ పూర్తయిన తర్వాత మాత్రమే చాలా బ్యాంక్‌ల నుంచి మెసేజ్‌లు వస్తుంటాయి. తాజా సేఫ్టీ ఫీచర్‌లో అలా కాదు. లావాదేవీ పూర్తికాకముందే బ్యాంక్‌లు మిమ్మల్ని అప్రమత్తం చేస్తాయి. మోసాలకు అడ్డుకట్టవేసే ఈ చర్యల్ని తాము ఇప్పటికే అమలు చేస్తున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ తదితర కొన్ని బ్యాంక్‌లు ధృవీకరించాయి. ఇటువంటి సిస్టమ్‌ను అమలులోకి తీసుకొచ్చిన మరికొన్ని బ్యాంక్‌లు కూడా ఉన్నాయి.
నిరంతర పర్యవేక్షణ
ఆన్‌లైన్, కార్డ్ మోసాలను పసిగట్టి, వాటిని నిరోధించే సామర్థ్యంగల ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ టూల్స్‌ను స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ కూడా అమలు చేస్తున్నది. అనుమానాస్పద లావాదేవీలను నిరంతరం పర్యవేక్షించి, లావాదేవీ జరిగే డివైజ్, లోకేషన్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, మర్చెంట్ టైప్, లావాదేవీ విలువ తదితర డేటాను తమ సిస్టమ్ విశ్లేషిస్తుందని ఆ బ్యాంక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. లావాదేవీ ప్రతిదశలోనూ పలు కంట్రోల్స్ తమ బ్యాంక్ అమలు చేస్తున్నదని, లాగిన్ అయ్యే సమయం, చెల్లింపును అందుకునే లబ్దిదారును చేర్చడం లేదా ఖాతా నుంచి జరిగే లావాదేవీ.. ఇలా ప్రతీ దశలోనూ అమలు చేసే కంట్రోల్స్‌తో పాటు లావాదేవీలను పూర్తిగా బ్యాంక్ పర్యవేక్షిస్తుందని వివరించారు.
మీరు ధృవీకరించకపోతే...
ఈ సురక్షిత ఫీచర్ ద్వారా బ్యాంక్‌లు మీకు అనుమానాస్పద లావాదేవీ అలర్ట్ పంపించిన తర్వాత దానిని మీరు ధృవీకరించకపోతే బ్యాంక్ ఒక ఎస్‌ఎంఎస్ పంపిస్తుంది. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంక్ యూపీఐలో అనుమానాస్పద లావాదేవీ అలర్ట్‌కు మీరు స్పందించకపోతే దానిని నిలిపివేస్తుంది. అటు తర్వాత ‘ ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్ ఖాతా నుంచి 2024 మే 22న రూ.30,000 యూపీఐ చెల్లింపు లావాదేవీ ధృవీకరణ కోసం మిమ్మల్ని మేం రీచ్ కాలేకపోయాం. ఈ విషయమై వివాదాన్ని లేవనెత్తితే 18002662కు కాల్ చేయండి.
అన్‌బ్లాక్ చేయాలంటే 18001080కు కాల్ చేయండి. ఇండియా వెలుపల అయితే 912233667777కు కాల్ చేయండి’ అంటూ ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్‌కు ఎస్‌ఎంఎస్ పంపుతుంది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, యూపీఐ, నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌ల ద్వారా తమ కస్టమర్లు వారి ఖాతాల్లో నిర్వహించే లావాదేవీల పట్ల అప్రమత్తం చేయడానికి తాము వివిధ పద్ధతుల్ని పాటిస్తున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ అధికారి ఒకరు తెలిపారు. అసాధారణంగా కన్పించే లావాదేవీలైతే తాము ఖాతాదారుల రిజిష్టర్డ్ మొబైల్ నంబరుకు కాల్ చేస్తామన్నారు. ఖాతాదారు ఆ కాల్‌ను ధృవీకరించడం లేదా వివాదాన్ని లేవనెత్తడం (అది మోసపు లావాదేవీగా చెప్పడం) చేయాలంటూ ఆప్షన ఇస్తామని ఆ అధికారి వివరించారు.
బ్యాంక్‌లకు తెలిసేదెలా?
ఫలానా లావాదేవీ మోసపూరితమైనదని కనుగొని, నిరోధించడానికి ఒక అనలిటిక్స్ టీమ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఖాతాదారు సాధారణంగా జరిపే లావాదేవీల తరహాలో కాకుండా చేసే లావాదేవీని కూడా ఈ బృందం పట్టుకుంటుంది. తాము 24/7 ఈ పర్యవేక్షణను అమలు చేస్తున్నామని, అనుమా నాస్పదంగా కన్పించిన లావాదేవీలపై కస్టమర్లకు అలర్ట్‌లు ఇచ్చి, వారి ధృవీకరణను కోరుతున్నామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారి అగర్వాల్ వెల్లడించారు.
ఖాతాదారు తరచూ లావాదేవీలు జరిపే ప్రాంతం (యూజువల్ జియోలోకేషన్)లో కాకుండా ఆ ప్రాంతం వెలుపల లావాదేవీ జరిగితే ‘జియో ఫెన్సింగ్’ టెక్నిక్ ద్వారా బ్యాంక్‌లు కనుగొంటాయి. జియో ఫెన్సింగ్ టెక్నిక్‌తో బ్యాంకుల ఆయా ఖాతాదారుల జియోగ్రాఫిక్ ఏరియాల చుట్టూ వర్చువల్‌గా బౌండరీలు ఏర్పాటు చేస్తాయి. ఈ నిర్దేశించిన బౌండరీ వెలుపల జరిగే లావాదేవీని అదనంగా వెరిఫై చేస్తాయి. ఖాతాదారు కార్డు లేదా ఖాతా సమాచారం దొంగిలించబడి, వేరే ప్రాంతం నుంచి ఉపయోగించడాన్ని ఈ టెక్నిక్ నిరోధిస్తుందని స్టాండర్డ్ చార్టర్డ్ జీబీఎస్ (గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్) బృంద సభ్యుడు, డైరెక్టర్ ప్రదీప్ జనార్థన్ వివరించారు.
ఉదాహరణకు మీరు యూపీఐ, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు తదితరాలు ఉపయోగించి సాధారణంగా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలలో లావాదేవీలు జరుపుతుంటారనుకోండి. కానీ మీరు ఎన్నడూ లావాదేవీ నిర్వహించని జార్ఖండ్‌లోని జంతారా నగరం నుంచి లావాదేవీ జరుగుతుంటే బ్యాంక్ మీకు కాల్ చేసి ధృవీకరణను కోరుతుంది. కస్టమర్ యూజువల్ లోకేషన్‌తో ఆ లావాదేవీ లోకేషన్‌ను పోల్చిచూసి, బ్యాంక్‌లు అనుమానాస్పద లావాదేవీలను గుర్తిస్తాయని జనార్థన్ తెలిపారు. బ్యాంక్‌లు వారి ఖాతాదారుల ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్‌లను ఉపయోగించి, ఏ ఐపీ అడ్రస్ నుంచి లావాదేవీ జరుగుతున్నదో చూస్తాయన్నారు.
అలాగే బ్యాంక్ వద్ద పేరుబడిన మోసపూరిత ఐపీ అడ్రస్‌ల డేటాబేస్ ఉంటుందని, లావాదేవీ జరుగుతున్న ఐపీ అడ్రస్‌తో వాటిని పోల్చిచూస్తాయన్నారు. కొత్తగా తలెత్తుతున్న మోసపూరిత పద్ధతులను కనుక్కోవడానికి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఇంజిన్స్, మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథిమ్స్‌ను కొన్ని బ్యాంక్‌లు ఉపయోగిస్తున్నాయని అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ క్రైమ్ స్పెషలిస్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యురాలు శీతల్ భరద్వాజ్ చెప్పారు.
ఈ ఫీచర్ పనిచేసేది ఇలా..
బ్యాంక్‌లు అనుమానాస్పద లావాదేవీలను గుర్తించే ఒక క్రెడిట్ ఇంటిలిజెన్స్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. మీ సాధారణ లావాదేవీలకు భిన్నమైనవాటిని ఇది గుర్తించి, మిమ్మల్ని వెనువెంటనే అప్రమత్తం చేస్తుంది. మీరు అనుమతిస్తే తప్ప, అటువంటి లావాదేవీ జరక్కుండా చూస్తుంది. ఉదాహరణకు మీరు హైదరాబాద్ నగరవాసి అనుకోండి. మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి. కానీ మీరు ఎప్పుడూ దక్షిణాఫ్రికాలో ఆర్థికలావాదేవీ జరపలేదు. అక్కడికి ఎప్పుడూ వెళ్లనూ లేదు. హఠాత్తుగా మీ క్రెడిట్ కార్డ్‌పై దక్షిణాఫ్రికాలోని వెబ్‌సైట్ ద్వారా భారీ లావాదేవీ క్లిక్ అయ్యిందనుకోండి.
అప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ ఇంటిలిజెన్స్, కంట్రోల్ డిపార్ట్‌మెంట్ ఈ లావాదేవీపై మీకు తక్షణమే సమాచారం అందించి, మీ ధృవీకరణ కోసం కాల్ చేస్తుంది. ఈ కాల్‌ను మీరు తీసుకోకపోయినా, మీరు అనుమతించకపోయినా ఆ లావాదేవీని బ్యాంక్ తిరస్కరిస్తుంది. చెల్లింపు మోసాల బారిన తమ ఖాతాదారులకు పడకుండాయూపీఐ, నెట్‌బ్యాంకింగ్/మొబైల్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్టులు తదితర అన్ని పేమెంట్ ఛానళ్లకు ఈ తరహా పర్యవేక్షణా వ్యవస్థను తాము అమలు చేస్తున్నామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ ఇంటిలిజెన్స్, కంట్రోల్ డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మనీశ్ అగర్వాల్ చెప్పారు.






