నాలుగో రోజూ డౌన్
న్యూఢిల్లీ, మే 29: లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్, వాస్తవ ఫలితాలు వెల్లడయ్యే సమయం దగ్గరపడుతున్నకొద్దీ ఇన్వెస్టర్లలో ఆందోళన పెరుగుతున్నది. గత మూడు రోజులుగా గరిష్ఠ ధరల్లో లాభాల స్వీకరణకు పాల్పడిన ఇన్వెస్టర్లు బుధవారం తక్కువ ధరల్లో సైతం షేర్లను యథేచ్ఛగా విక్రయించారు. దీంతో స్టాక్ సూచీలు గత 14 రోజులలో ఎన్నడూ లేనంత పతనాన్ని చవిచూశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 668 పాయింట్ల నష్టంతో 75,000 స్థాయిని కోల్పోయి 74,503 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 183 పాయింట్లు క్షీణించి 22,900 దిగువన 22,705 పాయింట్ల వద్ద నిలిచింది. రెండు సూచీలు గ్యాప్‌డౌన్‌తోనే మొదలై రోజంతా నష్టాల్లోనే కదలాడాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్‌లు నష్టపోగా, షాంఘై లాభపడింది. యూరప్‌లో కీలక మార్కెట్లయిన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు సైతం రెడ్‌లోనే క్లోజయ్యాయి.
టెక్ మహీంద్రా టాప్ లూజర్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా టెక్ మహీంద్రా 2.35 శాతం క్షీణించింది. ఐసీఐసీఐ బ్యాంక్ 2.2 శాతం మేర తగ్గింది. బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్లు 1 శాతం మధ్య నష్టపోయాయి. మరోవైపు పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, నెస్లే, ఐటీసీ, భారతి ఎయిర్‌టెల్‌లు స్వల్పంగా లాభపడ్డాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా బ్యాంకెక్స్ 1.37 శాతం పతనమయ్యింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.32 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.95 శాతం, రియాల్టీ 0.88 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 0.60 శాతం చొప్పున క్షీణించాయి. హెల్త్‌కేర్, ఇండస్ట్రియల్స్, టెలికమ్యూనికేషన్, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పవర్ ఇండెక్స్‌లు లాభపడ్డాయి. స్మాల్ క్యాప్ సూచి 0.23 శాతం పెరగ్గా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.38 శాతం తగ్గింది.
ఫలితాలపై ఆందోళనే కారణం
ఎన్నికల ఫలితాలపై ఇన్వెస్టర్లలో తలెత్తిన ఆందోళన కారణంగానే గత 14 సెషన్లలో ఎన్నడూలేనంత భారీగా మార్కెట్ తగ్గిందని మోతీలాల్ ఓస్వాల్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖెమ్కా చెప్పారు. బలహీన అంతర్జాతీయ సంకేతాలూ సెంటిమెంట్‌ను బలహీనపర్చా యన్నారు. నిఫ్టీ గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమై రోజంతా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నదని, ఎన్నికల టెన్షన్‌తో తీవ్ర అమ్మకాలు జరిగాయని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే తెలిపారు. లోక్‌సభ ఎన్నికల చివరిదశ పోలింగ్ జూన్ 1న జరుగుతుంది. అదే రోజున ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. వాస్తవ ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి. యూఎస్ ద్రవ్యోల్బణం గణాంకాలు శుక్రవారం వెలువడనున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు బలహీనంగానే ట్రేడవుతున్నందున, ఆ ప్రభావం కూడా భారత్ మార్కెట్‌పై పడిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అలాగే మే డెరివేటివ్ కాంట్రాక్టులు గురువారం ముగియనున్నందున మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుందని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అంచనా వేశారు.
కరిగిన రూ.5 లక్షల కోట్ల సంపద
వరుసగా నాలుగు రోజుల క్షీణత ఫలితంగా రూ.5.12 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 915 పాయింట్లు నష్టపోయింది. మే 27న ట్రేడింగ్ ప్రారంభంలో 76,009 పాయింట్ల రికార్డు గరిష్ఠం నుంచి సెన్సెక్స్ 1,506 పాయింట్లు పతనమయ్యింది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.5,12,922 కోట్ల మేర తగ్గి రూ.4,15,09,714 కోట్లకు పడిపోయింది.






