కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం!
న్యూఢిల్లీ, మే 28 : లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రధాని మోదీ తమిళనాడులోని కన్యాకుమారి వెళ్లనున్నారు. జూన్ 1న జరగనున్న తుది విడత ఎన్నికల ప్రచారానికి.. మే 30 సాయంత్రంతో గడువు ముగియనున్నందున ఆరోజే ప్రధాని కన్యాకుమారి చేరుకుంటారు. జూన్ 1 వరకు మూడు రోజుల పాటు ఆయన కన్యాకుమారిలోనే ఉంటారు. ఈ పర్యటనలో భాగంగా సముద్రం ఒడ్డున ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని 48 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. ఇదే స్థలంలో స్వామి వివేకానంద ఒకప్పుడు మూడు రోజుల పాటు ధ్యానం చేశారు.
ఈ పర్యటనలో ప్రధాని కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమా లకే సమయం కేటాయించనున్నారు. ఎలాంటి రాజకీయ కార్యక్రమా ల్లోనూ ఆయన పాల్గొనరు. 2019 లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు ముందు కూడా ప్రధాని ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రంలో ప్రార్థనలు చేశారు. హిమాలయా ల్లో 11,700 అడుగుల ఎత్తులో ఉన్న గుహలో ధ్యానం చేశారు. కేదార్ నాథ్ నుంచి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ప్రసిద్ధి చెందిన రుద్ర ధ్యాన గుహలో రాత్రి గడిపారు. కాగా, మూడోసారి అధికారం చేపట్టి హాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోంది. హ్యాట్రిక్ సాధిస్తామని ప్రధాని మోదీ బహిరంగ సభల్లో ధీమా వ్యక్తం చేస్తున్నారు. 543 లోక్‌సభ స్థానాలు ఉన్న పార్లమెంట్‌లో ఈసారి కనీసం 400 సీట్లకు పైగా స్థానాలను ఎన్డీఏ కూటమి సాధించబోతున్నట్లు ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు.






