అదానీ కోసమే పంపాడు
న్యూఢిల్లీ, మే 28: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనను భగవంతుడు పంపిచాడంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ విరుచుకుపడ్డారు. అదానీకి సాయం చేసేందుకు మోదీని దేవుడు పంపాడని, పేదలకోసం కాదని ఎద్దేవా చేశారు. ఒకవేళ నిజంగా దేవుడే మోదీని పంపి ఉంటే.. పేదలు, రైతులు, సాయం చేసేవారని, కానీ అలా కాకుండా అంబానీ, అదానీలకు సేవ చేసేందుకే ఆయనను పరమాత్మ పంపిం దంటూ ఉత్తరప్రదేశ్‌లోని బన్స్‌గావ్ ప్రాంతంలో మంగళవారం ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
భవిష్యత్తులో మోదీ చేసిన అవినీతిపై ఈడీ ప్రశ్నిస్తే.. దాన్ని కూడా దైవాంశసంభూతుడిగా తనను తాను చెప్పుకొని, దేవుడే చేయించాడని తప్పించుకు నేందుకే ఈ కథలు చెబుతున్నారంటూ రాహుల్ దుయ్యబట్టారు. ‘సడన్‌గా ఇప్పుడు దైవత్వం గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎన్నికల తర్వాత అదానీ గురించి ఈడీ అడిగితే అప్పుడు దేవుడు చెప్పినట్టే తాను చేశానని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు’ అని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విబేధాలు సృష్టించేలా పుంఖానుపుంఖాలుగా ఉపన్యాసాలు ఇచ్చే బదులు దేశం లోని నిరుద్యోగం వంటి అసలైన సమస్యల గురించి మాట్లాడాలని హితవు పలికారు.
వృద్ధిని పరుగులు తీయిస్తాం..
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశంలో ఆర్థిక వృద్ధిని పరుగులు తీయిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో ఉద్యోగ, ఉపాధి కల్పనలో కేంద్ర ప్రభుత్వం ఏ మేర కృషి చేసిందో పారదర్శకంగా చెప్పాలని మోదీకి సవాల్ విసిరారు. దేశంలో ఉన్న సవాళ్లను ఎలా అధిగమించాలో పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లలో ఉన్న 50 శాతం హద్దును చెరిపేస్తామని, రాజ్యాంగాన్ని కాపాడుతామని పేర్కొన్నారు. ‘రాజ్యాంగాన్ని కాపాడాలనే తప్ప ఉన్న ఇండియా కూటమి ఒకవైపు.. రాజ్యాంగాన్ని అంతం చేయాలన్న భావజాలం ఉన్న ఎన్డీయే కూటమి ఒకవైపు ఉన్నాయి’ అని రాహుల్ అన్నారు. ఇక ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ పథకాన్ని చెత్తబుట్టలో వేస్తామని చెప్పారు.






