మిజోరంలో విషాదం
1. కొండ చరియలు విరిగిపడి 17 మంది దుర్మరణం
2. శిథిలాల కింద మరో ఏడుగురు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
న్యూఢిల్లీ, మే 28: తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో కొండ చరియలు విరిగిపడి మిజోరంలో 17 మంది మృత్యువాతపడగా, పలువురు గాయపడ్డారు. రెమాల్ తుఫాన్ కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం మిజోరంలోని ఐజ్వాల్‌లో కుండపోత వర్షం కురిసింది. దీంతో హంథర్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. శిథిలాల్లో చిక్కుకుని 17 మంది మృతిచెందారు. శిథిలాల కింద మరో ఏడుగురు వరకు ఉన్నారని, వారిని సురక్షితంగా కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదని డీజీపీ శుక్లా మీడియాకు వెల్లడించారు. మరోవైపు తుఫాన్ నష్ట తీవ్రతపై సీఎం లాల్దు హమా ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.






