ప్రధాని మోదీ మౌనం సరికాదు !
- పశ్చిమాసియా ఉద్రిక్తతలపై స్పందించాలి
- ప్రధాని వైఖరితో దేశ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి
- ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ విమర్శలు
న్యూఢిల్లీ, జూన్ ౨౭: పశ్చిమాసియా యుద్ధం విషయంలో ప్రధాని మోదీ మౌన వహించడం సరికాదని, గాజాపై దాడులపైనా అదే వైఖరి అవలంబిస్తున్నారని ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తీవ్రంగా విమర్శించారు. శనివారం ఆమె ఓ ప్రముఖ దినపత్రికకు రాసిన వ్యాసంలో మోదీ వైఖరిపై నిప్పులు చెరిగారు. ప్రధాని వైఖరి కారణంగా భారత దేశ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, దీనిలో భాగంగానే పాలస్తీనా, ఇరాన్‌తోపాటు పలు పశ్చిమాసియా దేశాలతో భారత్‌కు ఉన్న చారిత్రక సంబంధాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు.
మోదీ నిశ్శబ్దం నైతికంగా సమర్థనీయం కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత దేశ విదేశాంగ విధానాలు, పాత మిత్రదేశాలను దూరం చేసుకునేలా ఉన్నాయని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి (ఐరాస) స్వతంత్ర అంతర్జాతీయ కమిషన్ నివేదికలను సైతం సోనియా ఈ సందర్భంగా ప్రస్తావించారు. గాజాపై ఇజ్రాయెల్ దాడుల వల్ల ౨౦ వేల మందికి పైగా పిల్లలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా మద్దతు వల్లే ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తోందని ధ్వజమెత్తారు. మరోవైపు, సోనియా వ్యాసాన్ని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం సామాజిక మాధ్యమం ద్వారా షేర్ చేశారు. భారత ప్రభుత్వం తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని తిరిగి సాధించుకోవాలని వారు హితవు పలికారు.






