18 June, 2026 | 1:51 AM

ఫార్మా విద్యార్థుల కోసం పీఆర్‌ఐపీ ప్రత్యేక కార్యక్రమం

18-06-2026 12:00 AM

బంజారాహిల్స్, జూన్ 17 (విజయక్రాంతి): ఫార్మా విద్యార్థులను కేవలం సంప్రదాయ ఫార్మాస్యూటికల్ ఉద్యోగాలకు పరిమితం చేయడం తమ లక్ష్యం కాదని గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ స్పష్టం చేసింది. వారి కోసం తమ సంస్థ ఆధ్వర్యంలో పుల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ (పీఆర్‌ఐపీ) ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ విషయమై ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు మాట్లాడుతూ ఫార్మసీ విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ కేర్ ఆవిష్కరణలు, స్టార్టప్ మెంటర్షిప్, ప్రాక్టికల్ వ్యాపార నిర్మాణ అనుభవాన్ని అనుసంధానం చేసేలా ఫ్యూచరిస్టిక్ కార్యక్రమం రూపొందించామన్నారు.

బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మ డి విద్యార్థులకు ఇందులో అవకాశం కల్పిస్తున్నామన్నారు. తద్వారా హెల్త్ కేర్ టెక్నాలజీ, డిజిటల్ హెల్త్, పరిశోధనాధారిత ఆవిష్కరణలు, వ్యాపార రంగం లో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులను సిద్ధం చేయనున్నట్లు వివరించారు.

ఇందులో పీఆర్‌ఐపీ ఫ్యాకల్టీతో పాటు ఫార్మా రంగ నిపుణులు, హెల్త్ కేర్ టెక్నాలజీ నిపుణులు, పేటెంట్ కన్సల్టెంట్లు, స్టార్టప్ సలహాదారులు ఉంటారని వెల్లడించారు. తమ విద్యార్థులు ఇప్పటికే కొన్ని ఆచరణాత్మక హెల్త్కేర్ కాన్సెప్ట్లపై పని చేస్తున్నారని తెలియజేశారు.