ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
- న్యాయమూర్తులు వై.జయప్రసాద్, ఎన్.సంతోష్ కుమార్
- బాలసదనం, జిల్లా జైలు సందర్శన
సిద్దిపేట క్రైం, మే 21 : ఖైదీలు సత్ప్రవర్తనతో ఉండాలని ఒకటో అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి వై.జయప్రసాద్, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.సంతోష్ కుమార్ సూచించారు.జిల్లా న్యాయసేవాధికారసంస్థ చైర్ పర్సన్, సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సాయిరమాదేవి గారి అదేశానుసారం బాలసదనం, సిద్దిపేట జిల్లా జైలును గురువారం వారు సందర్శించారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ జి.రత్నం, డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ వికాస్, జైలు సిబ్బంది న్యాయమూర్తులకు సాదరంగా ఆహ్వానించారు. ఖైదీల వంట గది, స్టోర్ రూం, మరుగుదొడ్లను న్యాయమూర్తులు పరిశీలించారు. ఖైదీలకు కల్పిస్తున్న భోజనం, వసతుల గురించి జిల్లా జైలు సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు.
ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలందరికీ అడ్వకేట్స్ ఉండాలని సూచించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రతి వారం జైలును సందర్శిస్తారని, అడ్వకేట్స్ లేనివారికి లీగల్ ఎయిడ్ కౌన్సిల్ న్యాయ సహాయం అందిస్తుందని తెలిపారు.
అనంతరం బాలసదనంను సందర్శించి అక్కడి పిల్లలతో మాట్లాడారు. వారి బాగోగులు తెలుసుకున్నారు. పిల్లలకు చట్టాలు, చదువు విలువ గురించి వివరించారు. పిల్లలకు ఎటువంటి సమస్యలున్నా సిద్దిపేటలోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫీసును సంప్రదించాలని సూచించారు. శిశుగృహంలోని గదులు, పరిసరాలను పరిశీలించారు. సిబ్బంది విధులకు సక్రమంగా హాజరు అవుతున్నరా, లేదా అని అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. భోజన నాణ్యత, వంటగది పరిసరాలు, నిల్వ ఉన్న ఆహార పదార్ధాలను పరిశీలించారు. న్యాయమూర్తుల వెంట డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సీహెచ్ శరత్ బాబు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్సు కౌన్సెల్ ఎం.రవికుమార్, సిద్దిపేట, న్యాయసేవ సిబ్బంది ఉన్నారు.






