వసతిగృహంలో సమస్యల తిష్ట
- విరిగిపోయిన బాత్రూమ్, లెట్రిన్ తలుపులు
ఇబ్బందుల్లో విద్యార్థులు
సత్తుపల్లి, మార్చి 16, ( విజయక్రాంతి ): ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో వసతి గృహాలలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామంటూ ఊక దంపుడు ఉపన్యాసాలు దంచుతున్నారు. క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా అసౌకర్యాలు తిష్ట వేసి దర్శనమిస్తున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని bసత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో ఉన్న ప్రభూత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహం అందుకు చక్కని తార్కాణం.
వసతి గృహంలో మౌలిక సదుపాయాల లోపం తీవ్రంగా కనిపిస్తోంది. హాస్టల్లో ఉన్న బాత్రూమ్లు , లెట్రిన్ గదుల తలుపులు విరిగిపోయి ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజులుగా బాత్రూమ్, లెట్రిన్ గదుల తలుపులు పాడైపోయి తాళాలు లేకుండా ఉండటంతో విద్యార్థులకు గోప్యత లేకుండా పోయింది. కొన్ని తలుపులు పూర్తిగా వంగిపోయి ఉపయోగించలేని పరిస్థితిలో ఉన్నాయి.
దీంతో హాస్టల్లో నివసిస్తున్న విద్యార్థులు బాత్రూమ్లు ఉపయోగించడంలో అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు. హాస్టల్లో పరిశుభ్రత , సౌకర్యాలు మెరుగుపరచాలని, వెంటనే బాత్రూమ్, లెట్రిన్ తలుపులను మరమ్మతు చేయించాలని విద్యార్థులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ హాస్టల్లలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.




