17 March, 2026 | 3:41 AM

ప్రజా ప్రభుత్వంలో కొత్త పింఛన్ల జాడ ఎక్కడ?

17-03-2026 12:06 AM
  1. పెన్షన్ల కోసం నిరీక్షణ కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు
  2. గ్రామ కార్యాలయాల చుట్టూ  ప్రదక్షిణలు..
  3. గత నాలుగు ఏళ్లుగా పెన్షన్ల స్కీం బంద్ చేసిన ప్రభుత్వాలు

చర్ల, మార్చి 16, (విజయక్రాంతి) : ప్రజా ప్రభుత్వంలో కొత్త పెన్షన్ల జాడ ఎక్కడ అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వాలు కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోవడంతో దరఖాస్తుదారులు పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్న వైనం జిల్లాలో నెలకొంది. చర్ల మండలంలో  కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి వందలాది మంది అర్హులు నిరీక్షిస్తున్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎన్నికల హామీ ప్రకారం ఆసరా చేయూత పెన్షన్లు రూ 4000, దివ్యాంగుల పెన్షన్లు రూ 6000 లకు పెంచుతామని హామీ ఇచ్చిన రెండేళ్లు పూర్తయిన ఆచరణలోకి రాలేదు., ఈసారి బడ్జెట్ సమావేశాల ఆలస్యం కారణంగా, ఏప్రిల్ నెల తర్వాత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. గ్రామపంచాయతీ కార్యాలయాల చుట్టూ దరఖాస్తుదారులు ప్రదక్షిణాలు చేస్తున్నారు తప్ప ఫలితం లేకుండా పోతుంది. మండలంలో 5,082 మందికి పెన్షన్ ఇస్తున్నారు, వృద్ధాప్య పెన్షన్ 2171 మందికి  , వితంతు 1931, ఒంటరి మహిళలు 366, వికలాంగులు,

దివ్యాంగులు 614, మెడికల్ పెన్షనలు 65 మంది తీసుకుంటారు. ప్రస్తుతం ప్రభుత్వం వృద్ధులకు రూ. 2వేలు, దివ్యాంగులకు రూ. 3వేలు, ఒంటరి మహిళలకు రూ. 2వేలు, మెడికల్ పేషంట్లతో కలిపి ప్రతి నెలా ఒకటో తేదీనే ఇస్తోంది. ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ , వితంతు పెన్షన్, ఒంటరి మహిళలు కొత్త పెన్షనల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం సామాజిక పెన్షనలు వస్తున్న వృద్ధులు అనారోగ్యంతోగానీ, ప్రమాదవశాత్తు గానీ చనిపోతే వెంటనే ఆ కుటుంబానికి చెందిన అతని భర్య, భర్తకు వెంటనే స్పౌజ్ క్రింద ఆ పెన్షనను మంజూరు చేస్తున్నారు.

అయితే కొత్త వారి నుంచి మాత్రం దరఖాస్తులు స్వీకరించడం లేదు. దీంతో ఇటీవల 60 సంవత్సరాలు నిండిన వారు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, మొత్తం కలిపి 3,000 మంది దాకా  పింఛన కోసం దరఖాస్తు చేసి  నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేసే ఆదుకోవాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు.