3 August, 2026 | 8:52 PM

పందిపంపుల గ్రామ సమస్యలు పరిష్కరించాలి

03-08-2026 08:19 PM

ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు గ్రామ ప్రజల వినతి

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని పందిపంపుల గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ ప్రజలు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రాహుల్ శర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లావుడ్య రాధిక మాట్లాడుతూ... గ్రామ శివారులోని 34వ సర్వే నెంబర్ లో దశాబ్దాలుగా సాగులో ఉన్న భూములపై అటవీ శాఖ అధికారులు చేస్తున్న వేధింపులను నిలిపివేయాలని, ఆ భూములను సాగు చేస్తున్న అర్హులైన రైతులందరికి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

దూదేకులపల్లె నుండి పందిపంపుల గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని, భూపాలపల్లి, పస్రా బస్సును పందిపంపుల మీదుగా నడపాలని తద్వారా గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. అదేవిధంగా పందిపంపుల నుండి సింగారం వరకు అసంపూర్తిగా ఉన్న రహదారి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపి శేషాల స్వాతి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్, రైతు సంఘం నాయకులు దామెర రమేష్, గ్రామ నాయకులు ఇటుకల ప్రభాకర్, లావుడ్య సమ్మయ్య, రేండ్ల భద్రయ్య, ఎల్లవేని సమ్మయ్య, వావిలాల విజయలక్ష్మి, దామెర శ్రీనివాస్, కషాబోయిన ఐలయ్య, కొమ్ము మహేష్, ముకులోత్ యమునాతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.