గ్రామాల్లో తాండవిస్తున్న సమస్యలు
గ్రామపంచాయతీ ఖజానా ఖాళీ
ఏడాది కాలంగా నిధులు లేక
కొట్టుమిట్టాడుతున్న గ్రామాలు నామమాత్రంగా గ్రామాల్లో ప్రత్యేక పాలన
కోదాడ మే 12: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు గ్రామాల్లో నిలిచాయి. దీంతో ఖజానా ఖాళీ కాగా సమస్యలతో తాండవిస్తున్నాయి. పాలకవర్గాల పదవీకాలం ముగిసిపోవడంతో 14 నెలలుగా ప్రత్యేక పాలన నామమాత్రంగానే కొనసాగుతుంది. గ్రామాలకు నిధులు విడుదల కాకపోవడంతో లక్షల్లో అప్పులు చేసి కార్యదర్శులు నెట్టుకు రావాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. నిర్వహణ భారం కావడంతో ఇటీవల ఎంపీడీవోలు జిల్లా అధికారులకు వినతి పత్రాలు అందించి గోడును వెల్లబోసుకున్నారు..
మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలంటే అప్పు చేయాల్సిన దుస్థితి
ఏడాదికాలంగా నిధులు లేకపోవడంతో గ్రామపంచాయతీలు కొట్టుమిట్టలాడుతున్నాయి. గత సంవత్సరం ఫిబ్రవరి 2 నుంచి సర్పంచ్ ల పదవి కాలం ముగియడంతో పరిపాలన వ్యవస్థ ప్రత్యేక అధికారుల చేతిలోకి వెళ్ళింది. నాటి నుంచి నేటి వరకు ఖాజానాల్లో కాసులు జమకు నోచుకోకుండా పోతుండడంతో వచ్చే ఆరకోర నిధులు సిబ్బంది వేతనాల చెల్లింపులకే సరిపోతున్నాయని కార్యదర్శులు పేర్కొంటున్నారు.
దీంతో గ్రామాల్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న పంచాయతీ కార్యదర్శిలు అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురించింది. పంచాయతీ కార్యదర్శుల వైపు అధికారులు దృష్టి సాధించలేకపోతున్నారు. నిధుల లేమితో గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు గ్రామాల్లో అడుగుపెట్టకుండా కేవలం సొంత కార్యాలయాల నుంచి మానిటరింగ్ చేయాల్సిన దుస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది.
మరమ్మత్తులకు నిధులు లేవు
గ్రామాల్లో వీధి దీపాల మరమ్మతులకు పంచాయతీల ఖజానాల్లో నిధులు లేకపోవడంతో వాటిని మరమ్మతులు చేయడానికి కార్యదర్శులు మొగ్గు చూపకపోకపోవడంతో పల్లెల్లోని ప్రజానీకం అంధకారంలోనే కాలం వెల్లదిస్తున్నారు.. ఇటీవల కొన్ని మండలాల్లో దొంగలు అంధకారంలో ఉన్న గ్రామాలను ఎంచుకొని దొంగతనాలకు పాల్పడ్డ ఘటన ఉంది. దీంతో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వీళ్ళదియాల్సిన పరిస్థితి నెలకొన్నాయి.
చేసిన పనులకు బిల్లులు రాక ఒకవైపు మౌలిక సదుపాయాల కల్పనకు ఖజానాలో కాసులు లేక గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు, ఇటు గ్రామపంచాయతీ కార్యదర్శులు మొక్కుబడిగా గ్రామాలను సందర్శిస్తున్నారు. దీంతో గ్రామాల్లో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. కనీసం మండే ఎండల్లో బుక్కెడు నీళ్లు అందించాల్సిన పీడబ్ల్యూఎస్ స్కీం మోటార్లు కాలిపోతే, మరమ్మత్తులు చేయడానికి కాసులు లేకపోవడంతో సంబంధిత అధికారులు మరమ్మతులు చేపట్టలేకపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారుల స్పందించి గ్రామపంచాయతీలకు పెరుక్కుపోతున్న బకాయి నిధులను విడుదల చేసి ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు ఏ మేరకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే...






