నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు
కలెక్టర్ కుమార్ దీపక్
లక్షెట్టిపేట, ఏప్రిల్ 30: ప్రభుత్వ నిబంధనల మేరకు వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పిపిసి సెంటర్ నిర్వాహకులను ఆదేశించారు. గురువారం మండలంలోని ఇటి క్యాల -1, తిమ్మాపూర్ గ్రామాలలో కొనసా గుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చే సమయంలో నిబంధన ప్రకారం మట్టి గడ్డలు, తాలు, తప్ప లేకుండా, తేమ 17 శాతానికి మించకుండా తదితర ఇతర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసిన తర్వాత ఆన్‌లైన్‌లో ట్రక్ షీట్ జనరేట్ చేయబడుతుందని, కొనుగోలు కేంద్రం, మిల్లుల టాగింగ్ ఆటోమేటిక్ గా అవుతుందని, ధాన్యం లారీ పక్కదారి పట్టకుం డా జిపిఎస్ పరికరం బిగించబడి ఉంటుం దన్నారు.
అనంతరం మండల కేంద్రంలోని 30 పడకుల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అవుట్ పేషెంట్ రిజిస్టర్, మందుల నిల్వలు, ల్యాబ్, వార్డులు, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వేసవి దృష్ట్యా వడ దెబ్బకు గురి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిం చాలన్నారు.
అవసరమైన మందులను అందు బాటులో ఉంచుకోవాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటిం చాలన్నారు. ఆసుపత్రి ఆవరణలో కొన సాగుతున్న పోస్టుమార్టం గది నిర్మాణ పనుల వివరాలు తెలుసుకొని త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
మంచిర్యాల: ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని అన్ని రంగాలలో రాణించాలని జిల్లా కలెక్టర్ కుమా ర్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెర్ప్ సమావేశానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ భారతిలతో కలిసి హాజరై స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను విస్తరించాలని తెలిపారు. పెట్రోల్ బంకులు, డెయిరీలు, సోలార్ పవర్ ప్లాంట్లు, స్టిచింగ్, ప్లంబింగ్ వంటి రంగాల్లో మహిళలు ముందుకు రావాలన్నారు. మహిళల సామర్థ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం 100 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, సహాయక సంఘాల మహిళలు ఇందులో పాల్గొని సర్టిఫికెట్ పొందిన అనంతరం వారి నైపుణ్యాల ఆధారంగా ఉపాధి అవకాశాలు కల్పించబడతాయన్నారు. మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న రంగాలను గుర్తించి సహాయక సంఘాలు తమ కార్యకలాపాలను విస్తరించాలని సూచించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిలో ఉందని, జిల్లా సమాఖ్య సభ్యులు ఆర్థికంగా లబ్ధి పొందాలని తెలిపారు. మెషిన్, సెంట్రింగ్, సిమెంట్ ఇటుక యూనిట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాఖ్య ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
మంచిర్యాల జిల్లా కేంద్రంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ కుమార్ దీపక్ గురు వారం పరిశీలించారు. పట్టణంలోనీ సాయికుంట ప్రాంతంలో చేపట్టిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తయ్యే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలేజ్ రోడ్డులో నిర్మితమవుతున్న ప్రభుత్వ ఆసుపత్రి, క్రిటికల్ కేర్ విభాగాల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మంచిర్యాల పట్టణంలోని ఆర్ డీ ఓ కార్యాలయాన్ని సందర్శించి ఆర్ డీ ఓ శ్రీనివాస్ రావుతో కలిసి దరఖాస్తుల పరిష్కారం వివరాలను పరిశీలించారు. భారత జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారి 63, 163 జి రహదారుల ఏర్పాటులో భాగంగా జిల్లాలోని ప్రాంతాలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కార చర్యలను వేగవం తం చేయాలని కోరారు.






