కోస్గిలో ప్రాజెక్ట్ కే-100
100 మంది రైతులు, 100 వినూత్న వ్యవసాయ కార్యక్రమాలు
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, గ్రామీణ ప్రాంతాల్లో వినూత్న వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం లక్ష్యంగా నారాయణపేట జిల్లా కొస్గి డివిజన్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ కే--100 పేరుతో 100 మంది రైతులు, 100 వినూత్న వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే 100 మంది ప్రగతిశీల రైతులను గుర్తించి, ప్రతి రైతుకు ఒక ప్రత్యేక వినూత్న వ్యవసాయ కార్యకలాపాన్ని కేటాయించారు.
ఈ రైతులు తమ తమ గ్రామాల్లో ఆదర్శ నమూనా క్షేత్రాలను ఏర్పాటు చేసి, ఇతర రైతులకు ప్రత్యక్షంగా కొత్త సాంకేతికతలు, ఆధునిక సాగు పద్ధతులు మరియు ఆదాయాన్ని పెంచే విధానాలను పరిచయం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సహజ వ్యవసాయం, సేంద్రియ సాగు, ఉద్యాన పంటలు, పూల సాగు, పశుపోషణ, కోళ్ల పెంపకం, మత్స్య పెంపకం, సమగ్ర వ్యవసాయ విధానాలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, ప్రత్యక్ష మార్కెటింగ్, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ వినియోగం, నీటి సంరక్షణ, సూక్ష్మ పోషకాల వినియోగం వంటి అనేక వినూత్న అంశాలను ప్రోత్సహించనున్నారు.
ప్రాజెక్టు అమలులో వ్యవసాయ శాఖతో పాటు కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇతర అనుబంధ శాఖల సాంకేతిక సహకారం అందిస్తారు. కొస్గి మండలం మల్లారెడ్డిపల్లి రైతు వేదిక ముషీరిఫా పరిధిలో జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక బుధవారం క్షేత్ర పర్యటన చేశారు.
పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్ కె-100 చాలా ఉపయోగకరమైందని, ఈ ప్రాజెక్ట్ కు పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కోస్గి, మద్దూర్, కొత్తపల్లి, గుండుమల్ మండలాలకు చెందిన సుమారు 120 మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని పంటల వైవిధ్యీకరణ, ఆధునిక సాగు పద్ధతులు, ప్రాజెక్ట్ కే--100 ద్వారా లభించే ప్రయోజనాలపై అవగాహన పొందారు.






