ప్రాజెక్టులు వెలవెల!
జలాశయాల్లో అడుగంటుతున్న నీటిమట్టాలు
కృష్ణా, గోదావరి బేసిన్లలో ఆందోళనకర నిల్వలు
- గత ఏడాదితో పోలిస్తే.. భారీగా తగ్గుదల
- ఇంకా ఆశించిన స్థాయిలో పడని వర్షాలు
- ఖరీఫ్ సాగుపై రైతాంగం ఆందోళన
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే జలాశయాల్లో నీరు ఇంకా పాతాళానికి వెళ్తుండడం, నైరుతిపవనాలు ఆలస్య మవడంతో ఇటు ఖరీఫ్‌సాగుపై, అటు తాగునీరుపై ఆం దోళన కలిగిస్తోంది. ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు డెడ్‌స్టోరేజీ కన్నా దిగువకు పడిపోతున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్లలో కూడా ప్రస్తుత నీటి నిల్వలు గత ఏడాదితో పోలిస్తే..భారీగా తగ్గుదల కన్పిస్తోంది. దీంతో వానాకాలం సాగుపై రైతాంగం దిగులు చెందుతున్నారు.

సాధారణంగా జూన్ మొద టి వారానికే నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి, ప్రాజెక్టుల్లోకి కొత్త నీటి ప్రవాహాలు ప్రారంభమవుతాయి. కానీ ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రధాన ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీ నిల్వలతో కొనసాగుతు న్నాయి. గత ఏడాదితో పోలిస్తే అనేక జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గడం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
నీటిపారుదల శాఖ తాజా గణాంకాల ప్రకారం తెలంగాణ పరిధిలోని ప్రధాన జలాశయాల మొత్తం నిల్వ సామర్థ్యం 793.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 283.56 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే మొత్తం సామర్థ్యంలో 35.72 శాతం మాత్ర మే నిల్వలు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్‌కు ముం దు ఈ స్థాయిలో నిల్వలు ఉండటం ఆందోళనకర పరిస్థితిగా అధికారులు, నిపుణులు అభివర్ణిస్తున్నారు.
కృష్ణా బేసిన్‌లో పరిస్థితి మరింత క్లిష్టం
తెలంగాణ సాగునీటి వ్యవస్థకు కీలకమైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నిల్వ లు ఆశించిన స్థాయిలో లేవు. శ్రీశైలం ప్రాజె క్టు పూర్తి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 39.67 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. నాగార్జునసాగర్‌లో 312.05 టీఎంసీల సామర్థ్యానికి 148.73 టీఎంసీల నీరు ఉంది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ప్రాజెక్టుల్లో నీటి మట్టా లు గణనీయంగా తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
మరోవైపు కృష్ణా ఎగువ ప్రాంతాల్లోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోనూ నిల్వలు పూర్తి స్థాయిలో లేకపోవడం దిగువ ప్రాంతాలకు వచ్చే ప్రవాహాలపై ప్రభావం చూపుతోంది. దీంతో శ్రీ శైలం, నాగార్జున సాగర్‌లోకి కొత్త నీటి ప్రవాహాలు ఆశించినంతగా రావడం లేదు. గోదా వరి బేసిన్‌లోని ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. శ్రీరాంసాగర్‌లో 80.50 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 15.99 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.
నిజాంసాగర్‌లో 7.26 టీఎంసీలు, మిడ్ మానేరు రిజర్వాయర్‌లో 7.52 టీఎంసీలు, లోయర్ మానేరు డ్యాంలో 6.28 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. కడెం ప్రాజెక్టులో అయితే పరిస్థితి మరింత దిగజారింది. 4.70 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 0.40 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఉమ్మడి కరీం నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని సాగు అవసరాలకు ఈ ప్రాజెక్టులే ప్ర ధాన ఆధారం. ప్రస్తుతం నిల్వలు తగ్గిపోవడంతో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఖరీఫ్ సాగుపై ప్రభావం..?
తెలంగాణలో ప్రతి ఏడాది కోటి ఎకరాలకు పైగా ఖరీఫ్ సాగు జరుగుతుంది. జూన్ రెండో వారం నుంచి రైతులు విత్తనాలు వేసే పనుల్లో నిమగ్నమవుతారు. అయితే ఈసారి ప్రాజెక్టుల్లో తగినంత నీటి నిల్వలు లేకపోవడం, వర్షాలు ఆలస్యమవడం రైతుల్లో ఆందోళన పెంచుతోంది. ప్రస్తుతం సాగునీటి అవసరం పెద్దగా లేకపోయినా జూలై, ఆగస్టు నెలల్లో పరిస్థితి కీలకంగా మారే అవకాశం ఉంది.
అప్పటికీ వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోతే నీటి విడుదలపై ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. సాగు అవసరాలతో పాటు తాగునీటి సరఫరా కూడా ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్‌తో పాటు అనేక పట్టణాలు, గ్రామాలు ప్రాజెక్టులపైనే ఆధారపడి ఉన్నాయి. వేసవి చివరి దశలో ఉండటంతో నీటి వినియోగం పెరిగింది.
కొత్తగా వర్షాలు లేకపోతే నిల్వలపై మరింత ఒత్తిడి పెరగనుంది. ప్రస్తుతం సింగూర్‌లో కూడా పరిమిత స్థాయిలోనే నీటి నిల్వలు ఉన్నాయి. హైదరాబాద్‌కు తాగునీటి సరఫరాలో సింగూర్ కీలక పాత్ర పోషిస్తుండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కాళేశ్వరం, పాలమూరు సీతారామ వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ వాటి నిర్వహణకు కూడా నదుల్లో నీటి లభ్యతే కీలకం. కృష్ణా, గోదావరి నదుల్లో సరిపడా ప్రవాహాలు లేకపోతే ఎత్తిపోతల పథకాల సామర్థ్యం కూడా పరిమితమవుతుంది. అందుకే ప్రస్తుతం ప్రభుత్వం, రైతులు, నీటిపారుదల శాఖ అధికారులు అందరూ నైరుతి రుతుపవనాలపైనే ఆశలు పెట్టుకున్నారు.
జూన్ రెండో వారం నుంచి రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిసి, ఎగువ ప్రాంతాల్లో వరద ప్రవాహాలు పెరిగితేనే ప్రాజెక్టులు ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. లేకపోతే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే నీటి కొరత రాష్ట్రానికి కొత్త సవాళ్లు తెచ్చిపెట్టే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.






