9 June, 2026 | 2:31 AM

గుజరాత్ గులాములు!

09-06-2026 01:22 AM

తెలంగాణ అభ్యున్నతికి అడ్డుపడితే పుట్టగతులుండవు

  1. కిషన్‌రెడ్డి ఒక లడాయి కోతి 
  2. బీజేపీ ఎంపీలపై సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజం 
  3. మియాపూర్‌లో రూ.1,675 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన 
  4. బాచుపల్లి ఫ్లైఓవర్ ప్రారంభం

రంగారెడ్డి/శేరిలింగంపల్లి, జూన్ 8 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతూ, ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న బీజేపీ ఎం పీలు గుజరాత్‌కు గులాములుగా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండి పడ్డారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్‌లో సోమవారం ఆయన సు మారు రూ.1,675 కోట్ల పలు అభివృ ద్ధి, మౌలిక వసతుల పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాం ధీ, కమిషనర్ సృజనతో కలిసి నూతన చెత్త తొలగింపు ఎలక్ట్రిక్ వాహనాలను పరిశీలించారు. అనంతరం బాచుపల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్‌రెడ్డి లడాయి కోతి అంటూ విమర్శించారు.

గుజరాత్‌ను అభివృద్ధి చేసుకోవడం నరేంద్ర మోదీ బాధ్యత అయితే.. తెలంగాణను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావులకు లేదా? అని ప్రశ్నించారు. ప్రాణహిత గోదావరి, సింగూరు జలాలు హైదరాబాద్‌కు రాకుండా, మెట్రో రైలు విస్తరణకు, మూసీ ప్రక్షాళనకు కేంద్ర నిధులు రాకుండా అడ్డుకుంటున్నది బీజేపీ ఎంపీలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీ గుజరాత్‌లో సబర్మతి ప్రాజెక్ట్ కడితే డప్పు కొట్టే వీరు, మన మూసీని బాగు చేసుకుంటామంటే ఎందుకు అడ్డుపడుతున్నారని నిలదీశా రు. ‘నేను ఢిల్లీకి వెళ్లి ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసి నిధులు అడిగితే.. కిషన్‌రెడ్డి మూడు రోజుల్లోనే మళ్లీ ఢిల్లీకి వెళ్లి పాలలో ఉప్పు వేసినట్లుగా కేంద్ర పెద్దలకు అబద్ధాలు చెప్తూ అడ్డుపడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే మీకు పుట్టగతులు ఉండవు.

వచ్చే ఎన్నికల్లో ఒక్కరు కూడా ఢిల్లీకి వెళ్లలేరు’ అని హెచ్చరించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, 12 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఏం చేశారో అసెంబ్లీలో నాలుగు రోజుల పాటు ప్రత్యేక చర్చ పెడదాం, రావాలని సవాల్ విసిరారు. మురికి కాలువల్లో మురికి తీయడానికి కూడా మోదీని చూసి ఓటేయాలా? అని విమర్శించారు.

తెలంగాణ రైసింగ్ సుదూర లక్ష్యం

దేశంలోని 29 రాష్ట్రాల్లో ఉన్న ఆరు పెద్ద నగరాలే భారత ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆయా నగరాల దుస్థితి దారుణంగా ఉందన్నారు. ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. ప్రధాని, చీఫ్ జస్టిస్‌లు సైతం వాతావరణ కాలుష్యంతో సతమతమవుతున్నారు. ఆఫీసులు, స్కూళ్లు బంద్ పెట్టే దుస్థితి వచ్చిందన్నారు. ముంబై దేశ ఆర్థిక రాజధాని అయినప్పటికీ కాస్త వర్షం పడితే చాలు 10 ఫీట్ల మేర మునిగిపోతోందన్నారు.

బెంగళూరులో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండటం వల్లే ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్‌కు వస్తున్నాయని చెప్పారు. చెన్నైలో వర్షం వస్తే పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఉన్నదన్నారు. కోల్‌కతాలో శాంతిభద్రతల సమస్య తీవ్రంగా ఉన్నదని, ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారన్న నమ్మకం లేదని ఆరోపించారు. ‘మన హైదరాబాద్‌కు అలాంటి దుస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే నిపుణులతో ప్రత్యేక కమిటీ వేసి ’తెలంగాణ రైసింగ్’ పేరిట సుదూర లక్ష్యంతో అభివృద్ధి చేస్తున్నాం.‘ అని సీఎం స్పష్టం చేశారు.

ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యమని, మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా సంక్షేమ పథకాల్లో భాగస్వాములను చేస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. అమెజాన్ లాంటి అంతర్జాతీయ సంస్థల్లో మహిళలు తయారు చేసిన వస్తువులను అమ్ముకునేందుకు వీలుగా హైటెక్ సిటీలో ’ఇంద్ర శక్తి’ స్టాళ్లను ఏర్పాటు చేశామన్నారు. పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, సోలార్ ప్రాజెక్టుల నిర్వహణను మహిళలకే అప్పగిస్తున్నామన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించాలని, 2039 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం వివరించారు.

శేరిలింగంపల్లికి వరాలు

గాజులరామారంలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ బస్సు టెర్మినల్ నిర్మాణ పనులు మూడు నెలల్లో ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని పేదల కోసం లక్ష ఇళ్ల మంజూరు, రాయదుర్గం నుంచి నియో పోలిస్ వరకు మెట్రో విస్తరణ, విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు నెట్ జీరో ఐటీ సెంటర్ల ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.

‘గతంలో పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి మహానుభావుల దూరదృష్టి వల్లే నేడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, ఓఆర్‌ఆర్ వంటివి సాధ్యపడ్డాయి. ఎన్నికలకు ఆరు నెలల ముందు రాజకీయం చేద్దాం.. కానీ ప్రస్తుతం అభివృద్ధిలో అన్ని పార్టీలు కలిసి రావాలి. రాబోయే రెండేళ్లలో రోజుకు 18 గంటలు తెలంగాణ అభివృద్ధి కోసం కష్టపడతాను’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

పాలనా సౌలభ్యం కోసం 3 కార్పొరేషన్లు

ఔటర్ రింగ్ రోడ్డు లోపల ప్రస్తుతం కోటి నాలుగు లక్షల పైచిలుకు జనాభా ఉందని, ఏటా జనాభా 3 శాతం పెరుగుతోందని సీఎం తెలిపారు. భవిష్యత్తు అవ సరాలను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిపాల నా సౌలభ్యం కోసం మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా సైబరాబాద్ పరిధిలో 76 కార్పొరేట్ స్థానాలు, మల్కాజిగిరి పరిధిలో 74, జీహెచ్‌ఎంసీ పరిధిలో 150 స్థానాలను విభజించినట్లు వెల్లడించారు.

అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి ఉన్నంత పేరు సైబరాబాద్‌కు ఉందని, దేశ ఐటీ ఉత్పత్తుల్లో 16 శాతం నిధులు ఇక్కడి నుంచే వస్తున్నాయని గుర్తుచేశారు. పేదలకు అపోలో, యశోద తరహా వైద్యం అం దించేందుకు అంతర్జాతీయ స్థాయిలో వైద్యంపై దృష్టి పెట్టామని, విద్యా రం గంలో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ఇంటర్మీడియట్ పాఠశాలలను తీసుకువస్తు న్నామని సీఎం తెలిపారు.