1 September, 2026 | 1:52 AM

ప్రజావాణి వినతులకు సత్వర పరిష్కారం చూపాలి : కలెక్టర్ అంకిత్

01-09-2026 12:28 AM
  1. ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి 
  2. ప్రజలకు చేరువగా ప్రజావాణి.. అందులో భాగంగా మండలాల్లోనూ నిర్వహణ 

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 31 (విజయక్రాంతి): ప్రజావాణి వినతులకు సత్వర పరిష్కారం చూపాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాల యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులు, ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన,

డీ.ఆర్.వో పద్మావతి,హోసింగ్ పీడీ సవయ్ రామ్ తో కలసి స్వీకరించారు. భూ సంబంధిత వివాదాలు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి, పెన్షన్లు, గృహాలు, మౌలిక వసతులు, సామాజిక భద్రత తదితర సమస్యలను ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం ప్రభుత్వం కల్పించిన ముఖ్యమైన వేదిక అని అన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు బాధ్యతతో వ్యవహ రించాలని ఆదేశించారు.

ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి ఎలాంటి అవకాశం ఉండకూడదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావాన్ని బట్టి సంబంధిత శాఖలకు వెంటనే పంపించాలని సూచించారు.

తక్షణమే పరిష్కరించగల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, క్లిష్టమైన సమస్యలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయంతో ప్రజల సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి వినతిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ, పరిష్కార స్థితిని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా స్పందించి, ప్రభుత్వ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందించాలని తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ప్రతీ మండల ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజాసమస్యల పరిష్కరానికి ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహిస్తు న్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మండల స్థాయిలోనే ప్రజలు తమ సమస్యలు,

వినతులను మండల ఎంపీడీఓ ఆధ్వర్యంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందే అవకాశం ఉందన్నారు. ప్రజలందరు తమకు సమీపంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రజలు తమ వినతులతో పాటు సమస్యకు సంబంధించిన అవసరమైన ఆధార పత్రాలను సమర్పిస్తే పరిష్కారం మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించేందుకు ప్రతి అధికారి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.  వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.