పొత్తా.. పోరా?
ఇప్పటికే ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన జనసేన
ఆ సీటును జనసేనకు వదిలేసి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానంలో బీజేపీ బరిలో దిగేనా!
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): రాష్ట్రంలో త్వరలో జరగబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏలో కలిసి ఉన్న బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందా? పోరు ఉంటుందా? లేకుంటే ఫ్రెండ్లీ ఫైట్ ఉంటుందా? అనేది చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. ఈ సస్పెన్స్‌కు ప్రధాన కారణం జనసేన ఒక అడుగు ముందుకేసి ఒక స్థానంలో అభ్యర్థిని ప్రకటించడమే. దీంతో బీజేపీ కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం ఏర్పడుతోంది.
జనసేన అభ్యర్థిని ప్రకటించినప్పుడు బీజేపీ మౌనంగా ఎందుకు ఉందన్న చర్చ జరుగుతోంది. పైగా జనసేన రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకుండా కేవలం ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఒక స్థానానికి మాత్రమే అభ్యర్థిని ప్రకటించి.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించకపోవడం వెనుక ఇరుపార్టీల అసలు వ్యూహం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఎత్తుగడేనా?..
బీజేపీ, జనసేన తీరు ఆయా పార్టీల కార్యకర్తల్లో పొలిటికల్ హీట్‌ను పెంచుతోంది. ఎన్డీఏలో జనసేన ఉంది. అలాగే ఏపీలో కూటమి పొత్తులో ఉన్న బీజేపీ, జనసేన.. తెలంగాణకు వచ్చేసరికి అలయన్స్ ఉంటుందా? ఉండదా? అని చర్చ జరుగుతున్నది. అయితే తెలంగాణలో ఎవరితో నూ తాము పొత్తు పెట్టుకోబోమని, అది అధిష్ఠానం నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఇప్పటికే ప్రకటన కూడాచేశారు.
ఈ క్రమంలోనే ఏకంగా జ నసేన ఖమ్మం, వరంగల్, నల్లొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ గడల శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. మరి అలాంటప్పుడు జనసేన కేవలం ఒక అభ్యర్థిని మాత్రమే ఎందుకు ప్రకటించింది. అది కూడా బీజేపీ నుంచి ఎక్కువగా టికెట్ ఆశించని ఖమ్మం, నల్లగొండ, వరంగల్ స్థానానికి. బీజేపీ నుంచి ఎక్కువ మంది టికెట్‌లు ఆశిస్తున్నది హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి స్థానం నుంచే. బీజేపీకి గెలుపు అవకాశాలు కూడా ఇక్కడనే ఎక్కువగా ఉన్నాయి.
గతంలో అంత కుముందు ఈ స్థానం నుంచే ప్రస్తుత బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఎమ్మెల్సీగా గెలిచినవారే. ఈ నేపథ్యంలోనే ఖమ్మం, నల్లగొండ, వరంగల్ స్థానం జనసేనకు.. హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి సీటు బీజేపీకి.. అని ఒప్పందం చేసుకోబోతున్నారా? అనే చర్చ జోరుగా జరుగుతోంది. లేకుంటే ఈ పాటికే బీజేపీ కూడా జనసేన ప్రకటించినట్లుగా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉండేది. అలా చేయలేదంటే చెరొక స్థానంలోనే అభ్యర్థిని నిలబెట్టి ఫ్రెం డ్లీ ఫైట్ చేయనున్నారా? అని చర్చ జరుగుతోంది.
బీజేపీ ఆశలన్నీ ఇక్కడే..
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బీజే పీలో టికెట్ కోసం పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. దాదాపు పది మంది నేతలు ఇక్కడి నుంచే టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్, మరో నేత పవన్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత ప్రకాశ్ రెడ్డి, మరో నేత సారంగుల అమర్నాథ్, ఎస్ మల్లారెడ్డి, బీజేపీ ప్రధాన కార్యదర్శి తూళ్ళ వీరేందర్ గౌడ్, శ్రీవర్థర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్ రెడ్డి, మరో ప్రధాన కార్యదర్శి పేరుతో సహా పలువురు పేర్లు రేసులో వినిపిస్తున్నాయి.
అయితే ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాత్రం బీజేపీలో ఇప్పటివరకు అంతగా పోటీ కనిపించడం లేదన్న చర్చ సాగుతోంది. ఇదే సమయంలో ఎన్డీఏ భాగస్వా మ్య పక్షమైన జనసేన ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించడం వెనుక బీజేపీ జాతీ య నాయకత్వం వ్యూహం ఏమిటనే చర్చ ఆసక్తికరంగా మారింది. జనసేన అభ్యర్థి ప్ర కటన కేవలం రాష్ట్రంలో పార్టీ విస్తరణలో భాగమా? లేక బీజేపీతో తెరవెనుక సీట్ల సర్దుబాటుకు ముందేవేసిన రాజకీయ ఎత్తుగడా..? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.






