20 ప్రతిపాదనలకు ఆమోదం
- ఆఖరి భేటీలో బల్దీయా పాలకవర్గం గ్రీన్‌సిగ్నల్
- పదవీకాలానికి ఒక్కరోజు ముందే ముగిసిన స్టాండింగ్ కమిటీ 12వ సాధారణ సమావేశం
- నగరాభివృద్ధి, క్రీడా, మౌలిక వసతులే ధ్యేయంగా నిర్ణయాలు
- ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు బండారి రాజీరెడ్డి పేరు
- రోడ్ల విస్తరణ, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలకు పెద్దపీట
హైదరాబాద్ సిటీ బ్యూరో ఫిబ్రవరి 09 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాల కమండలి పదవీ కాలం ముగియడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు.. సోమవారం నిర్వహించిన స్థాయీ సంఘం స్టాండింగ్ కమిటీ 12వ సాధారణ సమావేశం కీలక నిర్ణయాలతో ముగిసింది.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో జరిగిన ఈ భేటీలో నగరాభివృద్ధి, క్రీడా, మౌలిక వసతుల కల్పన, రహదారుల విస్తరణకు సంబంధించిన మొత్తం 20 ప్రతిపాదనలకు కమిటీ ఆమోదం తెలిపింది. అజెండాలో ఉన్న 9 అంశాలతో పాటు మరో 11 అదనపు అంశాలను టేబుల్ ఐటమ్స్‌గా చర్చించి కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నగరంలో క్రీడారంగానికి ఊతమిచ్చేలా పలు కీలక ప్రతిపాదనలకు ఈ సమావేశం లో ఆమోదం లభించింది.
ముఖ్యంగా బాలానగర్ ఫ్లుఓవర్ కింద ఉన్న ఖాళీ స్థలా న్ని క్రీడాప్రాంగణంగా మార్చి ఎన్‌ఆర్‌ఎస్సీ సంస్థకు ఏడాది పాటు అప్పగించాలని నిర్ణయించారు. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ 5వ దశ లో క్రికెట్ ప్రాక్టీస్ పిచ్‌లు, 9వ దశలోని ఇం డోర్ షటిల్ కోర్టు, నెక్సస్ మాల్ ఫ్లుఓవర్ కింద ఉన్న క్రీడా ప్రాంగణాల నిర్వహణకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు పిలిచేందుకు కమిటీ అనుమతించింది. అలాగే చం దానగర్ పీఅండ్‌టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కొత్త గా బాక్సింగ్ కోర్టు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు.
శ్మశానవాటికల అభివృద్ధిలో భాగంగా మూసాపేట సర్కిల్ యూసుఫ్‌నగర్‌లోని వైకుంఠధామం నిర్వహణకు, నాచారం ఎర్రకుంటలోని బరియల్ గ్రౌండ్‌ను ఆధునిక వైకుంఠధామంగా మార్చే పనులకు కమిటీ అంగీకరించింది. నగర రద్దీని నియంత్రించేందుకు రహదారుల విస్తరణ పనులకు ప్రాధా న్యతనిచ్చా రు. మనుసూరాబాద్ ఆనంద్‌నగర్ రోడ్డును 30 మీటర్ల వెడల్పుతో అభివృ ద్ధి చేసేందుకు 195 ఆస్తుల స్వాధీనం, మాస్ట ర్ ప్లాన్ మార్పులకు కమిటీ ఆమోదం తెలిపింది.
అదేవిధంగా సరోజినీనగర్- కోణార్క్ డయాగ్నోస్టిక్స్ రోడ్డు విస్తరణ కోసం 256 ఆస్తుల స్వాధీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాప్రా, నాచారం, కుషాయిగూడ ప్రాంతాల్లో దెబ్బతిన్న బీటీ రోడ్ల పునరుద్ధరణ, సీసీ రోడ్ల నిర్మాణం, డివైడర్ల ఏర్పాటుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. అల్వాల్ సర్కిల్ లక్ష్మీనగర్‌లో బాక్స్ డ్రెయిన్ నిర్మా ణం, సాఫిల్‌గూడ నడిమి చెరువులో జంగిల్ క్లియరెన్స్, డ్రైనేజీ మళ్లింపు పనులకు కూడా ఆమోదం లభించింది.
ఈ సమావేశంలో మరో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఉన్న ఎలివేటెడ్ కారిడార్‌కు శ్రీ బండారి రాజీరెడ్డి కారిడార్‌గా నామకరణం చేయాలన్న ప్రతిపాదనపై చర్చించి, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించారు. అయితే, సోమాజిగూడ- నాగార్జున సర్కిల్‌లో మలబార్ రాయల్ డిజైన్స్ సంస్థకు లాలీపాప్ ప్రకటనల అనుమతి ఇచ్చే అంశాన్ని మాత్రం ప్రస్తుతానికి నిలిపివేశారు.
వీటితో పాటు ఆస్తి పన్ను వసూళ్లు, అదనపు కమిషనర్లకు అధికారాల బదలాయింపు వంటి అంశాల్లో కమిషనర్ తీసుకున్న పలు చర్యలకు కమిటీ ర్యాటిఫికేషన్ ఇచ్చింది. సమావేశం ముగింపులో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లా డుతూ.. గడిచిన ఐదేళ్లలో నగరాభివృద్ధికి పాలకమండలి ఎంతో కషి చేసిందని, చివరి నిమిషం వరకు ప్రజోపయోగకరమైన నిర్ణయాలకే మొగ్గు చూపామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, వీ జగదీశ్వర్‌గౌడ్, సయ్యద్ మిన్హాజుద్దీన్, బూరుగడ్డ పుష్ప తదితరులతో పాటు జోనల్ కమిషనర్లు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ భేటీతో ప్రస్తుత స్టాండింగ్ కమిటీ తన ఐదేళ్ల బాధ్యతాయుతమైన ప్రస్థానానికి ముగింపు పలికింది.




