నిద్రతో నిరసన
అమృత్‌సర్, జూన్ 16: సమస్యలపై నిరసన తెలిపేందుకు అనేక మార్గాలున్నాయి. అయితే అమృత్‌సర్ ఐఐఎం విద్యార్థులు నిద్రతో నిరసన చెప్పారు. ఆ ప్రాంతంలో ఎండలు మండిపోతుండటంతో వసతిగృహాల్లో వారు ఉండలేకపోతున్నారట. తమ గదుల్లో ఏసీల ఏర్పాటుచేయాలని యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించినా ప్రయో జనం లేకపోయింది. దీంతో మెస్‌లో నిద్రకు ఉపక్రమించారు. కుర్చీలు, టెబుల్స్, స్టూల్స్.. ఇలా ఏవి దొరికితే వాటిపై నిద్రపోయారు. నినాదాలు లేవు.. గొడవలు లేవు.. విద్యార్థులంతా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మెస్‌లో నిద్ర పోయారు.
హాస్టల్ రూముల్లో ఏసీలు లేకపోయినా.. ఐఐఎం యాజమాన్యం మెస్‌లో మాత్రం ఏసీలు ఏర్పాటు చేసింది. అందుకే వారు మెస్‌ను నిరసనకు ఎంచుకొన్నారు. విద్యార్థులు గుంపుగా నిద్రపోతున్న వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఆ వీడియోకు ‘కొత్త సమస్యలకు కొత్త సమాధానాలు కావాలి’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ విద్యార్థులకు భారీ ఎత్తున మద్దతు లభిస్తున్నది. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఒక యూజర్ ట్వీట్ చేశాడు.






