20 August, 2026 | 10:07 PM

Breaking News

సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి

20-08-2026 08:30 PM

కల్మల్ చెరువు పీహెచ్సీని తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

గరిడేపల్లి,(విజయక్రాంతి) సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పెండెం వెంకటరమణ అన్నారు. మండలంలోని కల్మల్ చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో ఆసుపత్రిలోని వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పలు రికార్డులను పరిశీలించి, వాటి నిర్వహణ తీరును తనిఖీ చేశారు. ప్రస్తుతం వానాకాలం సీజన్‌ కావడంతో సీజనల్‌ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో సూచించారు. ముఖ్యంగా దోమల వ్యాప్తి పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకుని దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

గ్రామ పంచాయతీ సిబ్బందితో సమన్వయం చేసుకుని గ్రామాల్లో నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, అనుమానాస్పద జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, చలి వంటి లక్షణాలు కనిపించిన వెంటనే ప్రజలు సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ అఖిల్‌ కిషోర్‌, హెచ్ఈఓ సురేంద్ర, పీహెచ్ఎన్‌ జయమ్మ, నర్సింగ్‌ ఆఫీసర్లు జానకి, కళ్యాణి, ఏఎన్‌ఎంలు సుజాత, రాంబాయి, ఆశా వర్కర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.