ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న 'తాజా' టిఫిన్స్!
పొంగలిలో పురుగులు... ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానాలు!
ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి స్థానికుల డిమాండ్
ఘట్ కేసర్,(విజయక్రాంతి): తాజా అనే పేరును చూసి మోసపోకండి జోడిమెట్లలోని 'తాజా టిఫిన్స్' యాజమాన్యం ప్రజల ప్రాణాలతో బహిరంగంగా చెలగాటమాడుతోంది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ హోటల్‌లో కనీస పరిశుభ్రత కరువై, నాణ్యతా ప్రమాణాలు కరువయ్యాయి. శుభ్రతలేని ఆహారాన్ని వడ్డిస్తూ కస్టమర్ల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధి అన్నోజిగూడ, జోడిమెట్ల సమీపంలోని తాజా టిఫిన్స్ హోటల్‌కు స్థానికుడు శ్యాంసన్ తన కుటుంబంతో కలిసి వెళ్లారు.
ఎంతో నమ్మకంతో ఆర్డర్ చేసిన పొంగలిలో పురుగులు తేలడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్లేటులో పురుగులను చూపిస్తూ హోటల్ నిర్వాహకులను, సిబ్బందిని నిలదీయగా వారు తమ తప్పిదాన్ని ఒప్పుకోకపోగా, బాధ్యతారహితంగా మాట్లాడుతూ పొంతన లేని సమాధానాలతో దురహంకారం ప్రదర్శించారు. హోటల్ లోపల ఆహార పదార్థాల తయారీ తీరు అత్యంత అసహ్యకరంగా ఉంది.
టిఫిన్ పిండి, చట్నీలు, కర్రీస్‌పై ఎలాంటి మూతలు లేకుండా బహిరంగంగా వదిలేస్తున్నారు. నాణ్యత లేని దినుసులు వాడుతూ, ఈగలు వాలుతున్న పదార్థాలనే కస్టమర్లకు వడ్డిస్తూ హోటల్ నిర్వాహకులు లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. కేవలం పేరుకే 'తాజా' అని పెట్టి, రోగాలను పంచుతున్న ఇలాంటి నిర్లక్ష్యపు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ (ఆహార భద్రత) అధికారులు తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు శ్యాంసన్ తో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






