జైపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ
జైపూర్,(విజయక్రాంతి): వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల జిల్లాలోని జైపూర్ పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ బుధ వారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలించారు. అనంతరం రిసెప్షన్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి, సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి ఆన్‌లైన్‌లో కేసుల వివరాల నమోదు, అప్‌లోడ్ ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు.
పెండింగ్ కేసుల ఫైళ్లు, క్రైమ్ రికార్డులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి, పెండింగ్ వ్యవహారాలపై సీఐ నవీన్,ఎస్‌ఐ భూమేష్‌లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవడంతో పాటు సమాచార వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవాలని సూచించారు.
మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక కృషి చేయాలని తెలిపారు. అలాగే రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా, కారులో ప్రయాణించే వారు సీటుబెల్ట్ వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల భద్రత దృష్ట్యా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, వాటి అవసరం, ప్రాముఖ్యతపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాలని సూచించారు.
అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేసి మెరుగైన పోలీసు సేవలు అందించాలని సూచించారు. అనంతరం డీసీపీ పోలీసు అధికారులతో కలిసి జైపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ తనిఖీలలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ నవీన్, ఎస్‌ఐ భూమేష్ తదితరులు పాల్గొన్నారు.






