ఉపాధ్యాయుల ఆశలు, ఆశయాలకు ప్రతీక ఎస్టీయూ
- 80 వసంతాల వైభవోత్సవ వేడుకలో రాష్ట్ర అధ్యక్షులు సదానందం గౌడ్
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం, సంక్షేమం కోసం రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆవిర్భవించిందని, ఉపాధ్యాయుల ఆశలు, ఆశయాలకు ప్రతీకగా ఈ సంఘం నిలిచిందని స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (STUTS) రాష్ట్ర అధ్యక్షులు జి సదానందం గౌడ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టీయు భవన్ లో బుధవారం ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు మూగ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన 80 వసంతాల వైభవోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ తో కలిసి ఆయన మాట్లాడారు.
అన్ని ఉపాధ్యాయ సంఘాలకు ఎస్టీయూ తల్లి వంటిదని, స్వాతంత్య్రానికి ముందే సంఘం ఆవిర్భవించి ఎన్నో చారిత్రిక విజయాలతో మిగిలిన ఉపాధ్యాయ సంఘాలకు దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడి సాధించడంలో సంఘం ముందంజలో వుందని, డీఏ పెంపు,పెన్షన్ మంజూరు అంశాలలో సంఘం పాత్ర ప్రముఖమైనదని, బదిలీల్లో పారదర్శకతను పాటించడంలో క్రియాశీలకంగా వ్యవహరించామని, 317 జీవో విషయమై తీవ్రంగా పోరాడామన్నారు. అదేవిధంగా సంఘం పుట్టుక దగ్గరనుంచి నేటి వరకు గల చరిత్రను ఆయన వివరించారు.
నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ పోరాడి వేసవిలో ఒంటిపూట బడులు నిర్వహించడానికి సంఘం చేసిన కృషి అపారమైందని, 1959లో మొదటి పీయార్సీ సాధించడానికి 1980 నుంచి మంచి వేతనాలు పొందడానికి సంఘం చేసిన కృషి గొప్పదన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ బండారి అనూష మాట్లాడుతూ సమాజ నైతిక అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర అమోఘమైందని, నేడు నేను ఈ స్థానంలో ఉండడానికి ప్రధాన కారకులు ఉపాధ్యాయులేనని, మంచి సమాజం రూపకల్పనలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తేదీన వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది.
ఉద్యోగ ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు కల్పించిందని, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సమస్య అయిన పండిత్, పీఈటీ అప్ గ్రెడేషన్ చేపట్టిందని, రాబోయే రోజుల్లో పిఆర్సి ప్రకటన కూడా వెలువడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ రవికుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జాదవ్ అశోక్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బెజ్జంకి రవీంద్ర, పుప్పాల నరేందర్, రాష్ట్ర కార్యదర్శి శీతల్ చవాన్, జిల్లా ఆర్థిక కార్యదర్శి బత్తూరి సంతోష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పూర్వ అధ్యక్షులు చిలక విలాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






