1 July, 2026 | 12:54 AM

పల్స్ పోలియో విజయవంతం

01-07-2026 12:21 AM

99.3 శాతం మంది చిన్నారులకు పోలియో చుక్కలు 

జిల్లాలో ముగిసిన పల్స్ పోలియో కార్యక్రమం

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. డి. రామారావు

ఖమ్మం, జూన్ 30 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. ఈ నెల జూన్ 28 నుండి 30 వరకు మూడు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో 99.3శాతం మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ డి. రామారావు తెలిపారు.

జూన్ 28 (ఆదివారం) నిర్వహించిన పోలియో బూత్ లో పోలియో చుక్కలు వేయటంలో జిల్లాలోని 1,25,322 మంది 05 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం లక్ష్యంగా ఉన్న 1,31,642 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రెండు, మూడవ రోజుల్లో నిర్వహించిన గృహ సందర్శనలో జిల్లా వ్యాప్తంగా 3,50,774 ఇండ్లను ఆరోగ్య సిబ్బంది సందర్శించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా 298 ఇళ్లు ఎక్స్ మార్క్ ఇండ్లు గా గుర్తించబడినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 1,31,642 మంది చిన్నారుల లక్ష్యానికి గాను 99.3 శాతం మేర పోలియో చుక్కలు వేయడం జరిగిందని, మిగిలిన అర్హులైన చిన్నారులను కూడా త్వరితగతిన గుర్తించి పోలియో చుక్కలు అందించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఏ ఎన్ ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు, తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించేందుకు సహకరించిన తల్లిదండ్రులందరికీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. డి. రామారావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలకు నిర్దేశిత సమయానికి అన్ని టీకాలు వేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.