గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్
మెట్ పల్లి,(విజయక్రాంతి): గురుకుల విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించడంతో పాటు స్వచ్ఛమైన తాగునీటి సరఫరాలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మెట్‌పల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలను సందర్శించిన ఆయన కళాశాల వంటగదిని పరిశీలించారు. వంటశాల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, భోజన తయారీ విధానాన్ని పరిశీలించి విద్యార్థులకు ప్రతిరోజూ పరిశుభ్రమైన, పోషక విలువలు కలిగిన నాణ్యమైన భోజనాన్ని అందించాలని కళాశాల ప్రిన్సిపల్‌కు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.
అనంతరం ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలోని మిషన్ భగీరథ గ్రిడ్‌ను సందర్శించి తాగునీటి శుద్ధి, సరఫరా వ్యవస్థను పరిశీలించారు. నీటి నాణ్యత పరీక్షల వివరాలను అడిగి అధికారులను తెలుసుకుని, ప్రజలకు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నిర్వహణలో లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా ఇబ్రహీంపట్నం మండలం ఏర్దండి గ్రామంలో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి,కమిషనర్ శ్రీనివాస్ కళాశాల ప్రిన్సిపల్,అధ్యాపకులు, సిబ్బంది,మిషన్ భగీరథ ఈఈఎంబి జానకి, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో గణేష్, ఎంపీఓ రామకృష్ణ రాజు, గ్రామ సర్పంచ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






