18 June, 2026 | 2:12 AM

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం

18-06-2026 01:06 AM

కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రశ్నపత్రాల లీకేజీ  

‘ఛాత్రోం కీ గూంజ్’ మహార్యాలీలో రాహుల్‌గాంధీ

కోటా (రాజస్థాన్): ప్రశ్నపత్రాల లీకేజీలు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువత జీవితాలు ఒక్క రాత్రిలోనే నాశనం అవుతున్నాయని అన్నారు. రాజస్తాన్‌లోని కోచింగ్ హబ్ కోటా నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ’ఛాత్రోం కీ గూం జ్’ మహార్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీతో రాహుల్‌గాంధీ దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నపత్రాల లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జవాబుదారీతనం వహించాలని, అసలు సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ తక్షణమే రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు. 

విద్యారంగానికి తగ్గిన బడ్జెట్

దేశంలో విద్యావ్యవస్థ ప్రైవేటీకరణ వైపు సాగుతోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. కోచింగ్ ఫీజుల భారం విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీలు ఉన్నా ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. గత పదేళ్లలో విద్యార్థుల ఆత్మహత్యలు 65 శాతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించే బడ్జెట్‌ను భారీగా తగ్గించిం దని ధ్వజమెత్తారు.

దేశంలో దాదాపు లక్ష ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని ఆరోపించారు. విద్యార్థుల గొంతుకను వినిపించ డానికి, విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి పార్లమెంట్‌తో పాటు వీధుల్లోనూ పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ర్యాలీ.. రాజకీయ సభ కాదని, విద్యార్థుల భవిష్యత్తు సభ అని రాహుల్ ప్రకటించారు. నీట్, జేఈఈ, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను రాహుల్‌గాంధీ స్టేజ్ పైకి ఆహ్వానించారు. వారితో మాట్లాడి వారి కలలు, కోచింగ్‌కు తల్లిదండ్రులు చేసిన ఖర్చుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

‘ఛాత్రోం కీ గూంజ్’ షెడ్యూల్ 

కోటా నగరంలో ఘనంగా ప్రారంభమైన రాహుల్‌గాంధీ ‘ఛాత్రోం కీ గూంజ్’ దేశవ్యాప్త పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జూలై 10న అలహాబాద్, 11న పాట్నా, 14వ తేదీన ఢిల్లీలో రాహల్ పర్యటన ముగుస్తుంది. ఈ మూడు నగరాల్లో నిర్వహించే భారీ విద్యార్థి సదస్సుల్లో రాహుల్ ప్రసంగిస్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.