మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మంత్రి జూపల్లి
చిన్నంబావి, జూన్ 17 : ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్విని యోగం చేసుకొని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన బస్సును మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారత, ఆర్థిక స్వాలంబనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని,మహిళా ఇందిరా శక్తి పథకం ద్వారా రవాణా రంగాన్ని మహిళా ఉపాధి మార్గంగా మార్చాలనే ఉద్దేశంతో మండల మహిళా సమాఖ్యల ద్వారా బస్సులను కొనుగోలు చేయించి వాటిని తిరిగి సంస్థకే అద్దె ప్రాతిపదికన అందించే విధానాన్ని అమలు చేస్తున్నామని,వీటి ద్వారా సంఘాలకు ప్రతి నెల స్థిరమైన ఆదాయం సమకూరుతుందని ఆయన అన్నారు.
అనంతరం చరవాణి ద్వారా కలిగే ఉపయోగాలను మంత్రి మహిళలకు వివరిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో మంచానికే పరిమితమైన వెంకటరమణ జీవిత గాథను అతను సాధించిన విజయాన్ని ఫోనులో చూపించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి,మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఇందిర, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, రామచంద్ర రెడ్డి, బీచుపల్లి యాదవ్, సుధాకర్ నాయుడు, గంగారి శ్రీను, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, మండల అధికారులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.






