ప్రశ్నించే తత్వం.. మానవ వికాసం
- 30ఎం జెనోమిక్స్ కో -ఫౌండర్ బెనెట్ బోస్కో దాస్
- సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలే ముఖ్యం
- విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు
హైదరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): ప్రశ్నించడం అలవాటు చేసుకున్నప్పుడే మనిషిలో ఆలోచనలు పుడతాయని, ఆ ఆలోచనలే మానవ పరిణామానికి, అభివృద్ధికి పునాదులు వేస్తాయని 30ఎం జెనో మిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో, కో -ఫౌండర్ డాక్టర్ బి బెనెట్ బోస్కో దాస్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో సోమవారం ’ఎంట్రప్రెన్యూర్షిప్ సెల్’ (ఈ-సెల్)ను ప్రారంభించారు.
విద్యార్థులకు కేవలం చదువులోనే కాకుండా, సొంతంగా అంకుర సంస్థలను (స్టార్టప్స్) స్థాపించడానికి అవసరమైన నైపుణ్యాలను, ప్రోత్సాహాన్ని అందించే కేంద్రంగా ఈ-సెల్ పని చేయనుంది. డాక్టర్ బి. బెనెట్ బోస్కో దాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని, ఈ-సెల్ వంటి వేదికలు సృజనాత్మకతను వెలికితీసేందుకు అద్భుతమైన అవకాశాలని పేర్కొన్నారు.
విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు మాట్లాడుతూ.. ఆవిష్కరణల విషయంలో కేవలం ఆలోచనలు ఉంటే సరిపోదని, అవి వాస్తవ రూపం దాల్చినప్పుడే విలువ ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులుగా మీరు చేసే ఏ చిన్న ఆవిష్కరణ అయినా, అది సమాజానికి మేలు చేసేలా ఉండాలని సూచించారు. ఈ -సెల్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ’స్టార్టప్ స్పార్క్’ అనే కిక్-ఆఫ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలు, కీనోట్ ప్రసంగాలు మరియు ప్రశ్నోత్తరాల సెషన్లు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.




