calender_icon.png 3 December, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్‌గాంధీకి దేశంపై విజన్ లేదు

03-12-2025 01:01:24 AM

-జాతీయస్థాయిలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలం

-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి దేశ భవిష్యత్‌పై విజన్ లేదని, జాతీయస్థాయిలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలమైం దని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఏనాటికైనా ప్రాంతీయ పార్టీ లే బీజేపీ ప్రత్నామ్నాయం అని చెప్పా రు.

చెన్నైలో మంగళవారం జరిగిన శివ్ నాడార్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక ‘ఇగ్నిషీయన్’ సదస్సులో రిబూటింగ్ ది రిపబ్లిక్ అనే అంశంపై కేటీఆర్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు భవిష్యత్తులోనూ కొనసాగితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీజేపీని ఎదుర్కోవడం కష్టమని, ఆ పని కేవలం ప్రాంతీయ పార్టీలకే సాధ్యం అవుతుందని అన్నారు.

బీజేపీ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవెర్చడంలో మోసం చేసిందన్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. దేశాభివృద్ధిలో రాజకీయాలు, టెక్నాలజీ పాత్ర, ఇన్నోవేషన్ హబ్‌ల ఆవశ్యకత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై తన ఆలోచనలను పంచుకున్నారు.

తమ పాలనలో అనేక రంగాల్లో ప్రగతి సాధించిన తెలంగాణ గత రెండు సంవత్సరాల్లో వెనుకబడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచాకాల నుంచి పార్టీని కాపాడుకోవాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు, ఆచరణ సాధ్యం కాని హామీలన్నీ ప్రజల పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయని, ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.

వారసత్వ రాజకీయాలు కేవలం రాజకీయాల్లోకి రావడానికి ఉపయోగపడతాయని కానీ, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజల ఆమో దం ఉంటేనే రాజకీయాల్లో కొనసాగుతారని కేటీఆర్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలను అందుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలో తమ అధికారంలో ఇన్నోవేషన్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని, టీ-వర్క్స్ వంటి అనేక కొత్త సంస్థలను ఏర్పాటు చేశామన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఫిన్టెక్, హెల్త్ టెక్, ఫార్మా వంటి రంగాలను సమ్మిళితం చేసి ముందుకు వెళితే అనేక కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు. అయితే మన దేశంలో ఉన్న శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా వాటిని వెలికి తీసుకువచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి శక్తి సామర్థ్యాలతో పనిచేయడం లేదని కేటీఆర్ అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘డబుల్ ఇంజిన్’ వంటి నినాదాలతో మాత్రమే ఇది సాధ్యం కాదు అని, ఆచరణలో కూడా నిబద్ధత చూపించాల్సిన అవసరం ఉందన్నారు.