15 June, 2026 | 1:27 PM

Breaking News

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •   నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్   •   విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం.. విద్యార్థులకు టిఫిన్ తినిపించిన మంత్రి పొన్నం   •   విద్యుత్ షాక్ తో రైతు మృతి   •  

వాన రంగు మనుషులు

18-11-2024 12:00 AM

వానకు

వాళ్ళంటే మోహమో

వాళ్ళకు వానంటే చచ్చేంత దాహమో

అంచనా వేయడం ఎవరితరం.

మట్టి కాగితంపై

నాగలి కర్రుతో గీతలు కొడుతూ

ఆకుపచ్చని కావ్యానికి శ్రీకారం చుడతారు.

తొడుగుల్లేని పాదాలతో

బురదను ముద్దాడుతూ

జోరువానలో

మెరుపు తీగల్లా పొలమంతా తిరుగుతారు.

వీళ్ళ చేతివేళ్ళ చివర

వనాలేవో నిక్షిప్తమై ఉంటాయనుకుంటా

నేలను తాకిన తావుల్లో ఆకుపచ్చని కలలు

నిద్దుర లేస్తాయి.

వాన వాళ్ళు పురా దోస్తులు

ఒకళ్ళ భుజాలపై మరొకళ్ళు

చేతులు వేసుకొని ఋతువంతా తిరుగుతారు.

వానరంగు మనుషులు

వారి దేహం నిండా

రక్తమాంసాలకు బదులు

పంటలు, కాలవలు ఉంటాయి

ఉరుములు మెరుపులు

వారి ఉచ్చ్వాస నిశ్వాసాలు

మేఘాలు లాంటివారు

కురవడమే తప్ప

ఒట్టిపోవడం ఎరుగని వారు.