28 July, 2026 | 7:04 PM

వాన వచ్చుడే లేటు!

30-05-2024 12:54 AM

వికారాబాద్, మే 29(విజయక్రాంతి): వానకాలం పంటలకు రైతులు  సిద్ధమవుతున్నారు. అందుకగుణంగా వ్యవసా యశాఖ సన్నద్ధమవుతోంది. ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.  జిల్లా వ్యాప్తంగా 5.90 లక్షల  ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని అంచనా.  ఎక్కువగా పత్తి, మొక్కజొన్న, కంది పంటలకు రైతులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 72 శాతం భూమి పత్తి సాగుకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది 2,55,980 ఎకరాల్లో పత్తి సాగు కాగా, ఈ సారి 2,63,500 ఎకరాల్లో  వేస్తారనే అంచనాలు వేస్తున్నారు. కాగా, మొక్కజొన్న సాగు తగ్గే అవకాశం ఉందంటున్నారు అధికారులు. గత ఖరీఫ్ సీజన్‌లో 54,322 ఎకరాల్లో మక్కలు వేశారు.

ఈ సారి 50,450 ఎకరాలకే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. కంది సాగులో పెద్దగా తేడా లేకపోవచ్చని అంటున్నారు. ఇదిలా ఉండగా, నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం వరి వేయొద్దని స్పష్టం చేయడంతో వరి సాగుబడి తగ్గుతూ వస్తోంది.  ఏటా చిరు, తృణ ధాన్యాల సాగు పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నా.. రైతులు మొగ్గుచూపడం లేదు.  ఇదిలా ఉండగా, ఎప్పుడూ ఒకే రకమైన పంట కాకుండా పంట మార్పిడి ద్వారా రైతులకు మేలు జరుగుతుందని, ఈ మేరకు ఇతర పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ సలహా ఇస్తున్నారు.