వరంగల్ ధార్మిక భవన్ మాదే!
మేడారం ఆలయ పూజారుల సంఘం స్పష్టం
భద్రకాళి అర్చకుల తీరుపై నల్లబ్యాడ్జిలతో నిరసన
హనుమకొండ, మే 29 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్మించిన ధార్మిక భవన్ తమదేనని, ఎట్టి పరిస్థితుల్లో ఆ భవనాన్ని వదులుకునేది లేదని మేడారం పూజారుల సంఘం స్పష్టంచేసింది. భద్రకాళి దేవస్థానం అధికారులు, అర్చకులు ధార్మిక భవన్ ఆక్రమించుకునేందుకు కుట్ర లు చేస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం మేడారం సమ్మక్క సారలమ్మ ప్రాంగణంలో పూజారులు (వడ్డెలు) రెండు రోజుల ధర్నా కు దిగారు.
ఈ సందర్భంగా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు కాక సారయ్య, లక్ష్మణరావు, కొక్కెర కృష్ణయ్య, సిద్దబోయిన స్వామి, రఘుపతిరావు, పరమయ్య పూజారుల కుటుంబ సభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మేడారం ఆలయ సౌకర్యం కోసం 1993లో వరంగల్ సెంట్రల్ జైలు ఎదుట దేవాదాయ శాఖ కేటాయించిన 1014 గజాల స్థలంలో గతేడాది ధార్మిక భవన్ నిర్మించుకున్నట్టు తెలిపారు. ఈ భవనంలో దేవా దాయ శాఖకు చెందిన కార్యాలయాలతోపాటు మేడారానికి సంబంధించిన ఈవో కార్యాలయం కొనసాగుతుందని తెలిపారు. భద్రకాళి అర్చకులు, అధికారుల కోరిక మేరకు వేదపాఠశాల నిర్వహించుకునేందుకు వసతి కేటాయించినట్టు చెప్పారు.
ఈ క్రమంలో వేదపాఠశాల పేరిట మొత్తం భవనాన్ని దక్కించుకునేందుకు ఆలయ అధికారులు, అర్చకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు సైతం కలగజేసుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వారి చర్యలకు నిరసనగా మేడారం గద్దెల ప్రాంగణంలో రెండు రోజులు ధర్నా చేపట్టినట్టు తెలిపారు. సమస్యను పరిష్కరించకుంటే వచ్చే నెల 5 నుంచి 8 తేదీల్లో భద్రకాళి దేవస్థానం ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు మేడారం పూజారుల సంఘం హెచ్చరించింది.






