28 July, 2026 | 6:17 PM

ఎరువులు దాచిపెడితే లైసెన్స్ రద్దు

30-05-2024 12:57 AM

వికారాబాద్, మే 29 (విజయక్రాంతి): కావాలని సరుకులు దాచిపెట్టి రైతులను ఇబ్బంది పెట్టాలనుకుంటే బాధ్యులపై చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారుల లైసెన్సులు రద్దు చేస్తామని తేల్చిచెప్పారు. ఎరువుల విక్రయాలపై వికారాబాద్ అగ్రికల్చర్ అధికారులు గట్టి నిఘా కొనసాగిస్తున్నారు. ఇందుకు ఎఫ్‌ఐబీ పేరిట ఓ యాప్‌ను సృష్టించారు. జనవరి నుండి యాప్ అమల్లోకి వచ్చిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.ఈ యాప్ ద్వారా ఏయే ఫర్టిలైజర్ షాపుల్లో ఎన్ని ఎరువులు, పురుగుమందులు నిల్వ ఉన్నాయో రైతులు కూడా ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.

ఫలితంగా నకిలీలు, బ్లాక్‌మార్కెటింగ్ వ్యవస్థను అరికట్టవచ్చని పేర్కొంటున్నారు.  ఈ యాప్‌తో జిల్లాలోని 359 ఎరువుల దుకాణాలను అనుసంధాంచినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వారంలో రెండు సార్లు వ్యవసాయ శాఖ అధికారులు షాపులను సందర్శించి వివరాలను యాప్‌లో అప్‌డేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లెక్కల్లో తేడాలు వచ్చినా, సరుకు సక్రమంగా లేకపోయినా ఆయా షాపులపై కొరఢా ఝలిపిస్తారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఎరువుల డీలర్ల షాపులకు జీపీఎస్ ట్యాగ్ చేయగా, ఇప్పుడు ఈ యాప్ విధానంతో ఎరువుల విక్రయాలపై పూర్తి నిఘా కొనసాగుతుందని, బ్లాక్‌మార్కెట్ వ్యవస్థ తగ్గిపోతుందని భావిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ వెల్లడించారు.