3 May, 2026 | 2:13 PM

వాన సంగతులు

25-08-2025 12:00 AM

అమ్మ కొంగు చాటున

పిల్లాడు దాక్కున్నట్టు

మేఘాల మాటున

సూరీడు దాక్కున్నాడు..

కరిమబ్బుల మాటు నుంచి

మెరుపులు గర్జిస్తున్నాయ్..

ఉలిక్కి పడ్డ జింక పిల్ల

చిగురుటాకులా వణికింది..

ఆకాశం భువికి దిగివచ్చిందా.. అన్నట్లు

పొగ మంచు పర్వతపు అంచులని 

తాకుతూ పయనిస్తున్నది..

వాన చినుకులు

నిశ్చలమైన నీటి మడుగులో 

పడినప్పుడు వచ్చే శబ్దంతో

అడుగున నిద్రిస్తున్న చేప

చివాలున కళ్లు తెరిచింది..

రెక్కలు విప్పి విహరిస్తున్న పక్షి

గూటికి చేరి వణుకుతూ

పిల్లలను రెక్కల కింద దాచి వెచ్చదనాన్ని

ఇస్తూ ఒదిగిపోయింది..

వర్షంలో చిక్కుకున్న

చీమల గుంపొకటి

రైలుబోగీల్లా అతుక్కుని 

ముందుకు వెళుతున్నది..

ప్రకృతి ఒడిలో 

వర్షం తాలూకు సంగతులెన్నో !

 కోనేటి నరేష్