దనియార్ పాట.. ఏదీ మరియొకసారి!
దాదాపుగా పదేళ్లపాటు నన్ను వెంటాడిన పాత్ర దనియార్. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో మా ఇంగ్లిష్ లెక్చరర్ సుధీర్‌కుమార్ పాఠం చెప్తూ ‘జమీల్యా’ సినిమా గురించి చెప్పారు. ఇంగ్లిష్ పాఠం చెప్తూనే ఆ సినిమా ప్రసక్తి తెచ్చి ఆయన చెప్పిన తీరు నన్ను ఆ స్తెప్ మైదానాల్లో పడేసింది. ఆ పుస్తకం తెలుగులో 2013లో విజయవాడ బుక్‌ఫెయిర్‌లో పుస్తకం కనిపించినప్పుడు ఆయన చెప్పిన పుస్తకమేనా.. కాదా.. అనే ఆలోచనలోనే పుస్తకం కొన్నాను.
ఆ తర్వాత ‘జమీల్యా’ నన్ను వదలలేదు. ఆ రచనలోని వాతావరణం, ఉప్పల లక్ష్మణరావు వర్ణించిన తీరూ నన్నెంతగా ప్రభావితం చేశాయంటే, తరువాత నేను రాసుకున్న ‘కాలియా’ అనే పొయెట్రీ సిరీస్‌లో నాకు తెలియకుండానే ఆ వాతావరణాన్నీ, ఆ భాష నీ వాడాను. లక్ష్మణరావు ‘జమీల్యా’ అనువాదం ఇప్పటికీ నాకు చాలా ఇష్టం. ఎవరైనా ‘ఏవైనా మంచి బుక్స్ చెప్పు.. కొనుక్కుంటాను’ అన్నప్పుడు.. నేను చెప్పే మొదటి మూడు పుస్తకాల్లో‘ జమీల్యా’ కూడా ఉండేది.
అయితే.. నా కన్న చిన్నవాళ్లు కొందరు మాత్రం చదవడానికి కష్టంగా ఉందని, ఇంకొ న్ని పదాలైతే తామెప్పుడూ వినలేదని నాతో చెప్పారు. ముఖ్యంగా స్తెప్ మైదానాన్ని వర్ణించే చోట ఆ ఇబ్బంది ఎక్కువగా ఉంది. నిజానికి నాకు లక్ష్మణరావు భాషే నాకు చాలా ఇష్టంగా ఉండేది. రెండేళ్లకిందట ఒక యాప్ కోసం ఆడియో బుక్ చేయిస్తున్నప్పుడు ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్.. ఆ భాష చదవలేక పోగా ‘ఇదసలు తెలుగేనా? ఇదెవరో గూగుల్ ట్రాన్స్‌లేషన్‌లో కొట్టారు.
మీరు తెచ్చారు’ అని ఆమె అన్నప్పుడు నాకు కోపం వచ్చింది. ‘అది అనువా దం అవుతున్నప్పుడు గూగుల్ అనేది భవిష్యత్తులో వస్తుందని కూడా ఎవరికీ తెలియదమ్మా’ అని మనసులోనే అనుకున్నాను. ఆమెతో ఆ పుస్తకం చదివించటానికి నానాతంటాలు పడాల్సి వచ్చింది. కొన్ని పదాలను పలకలేకపోవ డం, వాక్యం ఎక్కడ ఆపాలో తెలియక తికమక పడటం చూశాక ఈ తరానికి కొంత సులభమైన భాష ఉండాలేమో అని బలంగా అనిపించింది.
భాష నాకు అద్భుతంగా ఉన్నా, కొత్తవాళ్లు చదివేందుకు, పఠనం అలవాటు లేని వాళ్లకి ఇబ్బందిగా ఉందని అర్థమైంది. అందుకే కొంచెం సరళమైన భాషలోకి మారిస్తే ఎలా ఉంటుం దా.. అని ప్రయత్నించాను. అలా చేయటం కూడా నాకూ ఇబ్బందే. ‘జమీల్యా’ అనువాదం రష్యన్ నుంచి చేసింది కాబట్టి.. నేను లూయీ ఆర్గోన్ ఇంగ్లిష్‌లోకి అనువాదం చేసిన పుస్తకం సాయంతో నేను తెలుగులోకి అనువదించాను.
నవలలో ప్రధాన పాత్ర అయిన సయ్యద్ మాటల్లో స్టెప్ మైదానాల వర్ణన, నాటి రష్యన్ గ్రామీణ జీవితాలు, యుద్ధకాలంలో పల్లెలు అనుభవించే నరకప్రాయమైన పరిస్థితులను నేను చేతనైనంత ఇప్పటి భాషలోకి మార్చగలిగాననే అనుకుంటాను.
జమీల్యా మధ్య ఉన్న ప్రేమనీ వాడుక భాషలో అంతే అందంగా మార్చగలిగాను. ఎందుకంటే జమీల్యా ప్రేమకథగానే ప్రచారంలో ఉన్నప్పటికీ, అది కేవలం ప్రేమకథ మాత్రమే కాదు.. నాటి రష్యా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో, ముఖ్యంగా రైతుల మీద నాటి పరిస్థితులు చూపించిన ప్రభావాన్ని చెప్పే కథ.
పండించిన పంటంతా సైనికుల కోసమే ఇచ్చి, దేశాన్ని నిలబెట్టుకున్న రైతుల నిస్సహాయమైన రోజులనీ, మగవాళ్లంతా యుద్ధానికి వెళితే పొలాల్లో నలిగిపోయిన ఆడవాళ్లు, పిల్లల కథ. రెండో ప్రపంచ యుద్ధకాలాన్ని డాక్యుమెంట్ చేసిన ఐత్‌మాతోవ్ ఈ నవలను ప్రేమకథగా చెబుతూనే, రాజకీయ కోణంలోనూ చూపించాడు. అందుకే, ఆ కథ ఇప్పటి తరం కూడా చదవాలి. ‘ఎన్నెలపిట్ట పబ్లికేషన్స్’ వారి సహకారం కూడా ఉండటం వల్ల ఆ పని నేను చేయగలిగాను.
ఇదే దారిలో ‘తల్లీ భూదేవి’ పేరుతో వచ్చిన ‘మదర్ ఎర్త్’, ‘తొలి ఉపాధ్యాయుడు’గా వచ్చిన ‘ది ఫస్ట్ టీచర్’ నవలలనూ నేను తెలుగులోకి తీసుకురాబోతున్నాను. కేవలం భాషా సమ స్యల వల్ల ఐత్‌మాతోవ్ రచనలను దూరం చేసుకోవటం ఆయన రచనలను అభిమానిం చే పాఠకుడిగా బాధించే విషయమే కదా. లక్ష్మణరావుతో పాటు మిగతా అనువాదకులు ఏ ఉద్దేశంతో వీటిని తెలుగులో కి అనువదించారో, దాన్ని మళ్లీ నేను కొనసాగిస్తున్నందుకు సంతోషంగా ఉంది.
నరేష్కుమార్ సూఫీ






