3 May, 2026 | 3:27 PM

చీకటి చెలిమి

25-08-2025 12:00 AM

తిమిరంతో

నాకు సమరం లేదు..

అది నా ప్రియమైన దోస్త్ 

పొద్దుతో యుద్ధం చేసి

అలసిపోయి సేద తీరుతానా

చీకటి చిక్కని

కలల పాలపుంతల్ని నాపై వంచి 

జోలపాడుతుంది

చీకటి నా అనేకానేక

ఆలోచనల వారథి

నా ఆకాంక్షల మెట్లెక్కించే సారథి

నిర్మలంగా నిశ్చలంగా

నన్ను నిద్రాదేవత ఒడిలోకి చేర్చేది చీకటే

చీకటంటే నాకు మక్కువ

చీకటిని నేనెందుకు ద్వేషించాలి..

చీకటితో చెలిమి చేసి చూస్తే

రాత్రి విలువ హృదిని చుట్టుకుంటుంది.

చీకటిని అల్లుకున్న రాత్రి 

ఎన్నో నిశీధి గీతాలను

మనసు పలకపై పరుస్తోంది

చీకటి గుంభనంగా

నిశ్శబ్దంగా నా కవితాక్షరాలను

స్వాగతిస్తుంది

ఎన్నో కవితలకు

పురుడు పోసిన సమయం అదే

నా ఊహలకు ప్రాణం పోసే 

అమృతం చిక్కని చీకటి 

రాత్రులే నా కన్నీళ్లను 

బాధల్ని నెమరువేసుకునే

నా ఆత్మీయ వాతావరణం చీకటే

చీకటి నా తోబుట్టువు

నన్ను రేపటి ఉదయానికి

శక్తివంతంగా ముస్తాబు చేసే 

అపురూపమైన నేస్తం

నాలోకి నేను అవలోకనమయ్యేది

చీకటి వాకిటి తోవలోనే

చీకటి నా ప్రియ దోస్త్ !

 డా.కటుకోఝ్వల రమేష్