రాజన్న ప్రసాదం..!
- ఏటా రూ.కోట్లలో ప్రసాదం విక్రయాలు
- అందని ద్రాక్షలా ‘ఫస్సై, భోగ్’ అనుమతులు
- ప్రసాదానికి గుర్తింపు తేవడంలో యంత్రాంగం విఫలం
రాజన్న సిరిసిల్ల, జూన్ 21 (విజయక్రాంతి): వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతోంది. కానీ, ఆయన ప్రసాదానికి మాత్రం సర్కారీ గుర్తింపు కరువైంది. రుచిలో తిరుమల ప్రసా దం తర్వాత రాజన్న లడ్డూపైనా భక్తుల్లో విశ్వాసం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి నిత్యం వేల సంఖ్య లో భక్తులు వస్తుంటారు. ప్రసాదం విక్రయాలతో ఆలయానికి కోట్ల లో ఆదాయం సమకూరుతున్నా ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) గుర్తింపు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. తెలంగాణలో పెద్ద దేవాలయంగా పేరుగాంచి, ఆదాయంలో అగ్ర స్థానంలో ఉన్న రాజన్న ఆలయ ప్రసాదానికి సరైన గుర్తింపు తేవడంలో ఆలయ అధికారులు సైతం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాజన్న లడ్డూకు ఆ ‘భోగ్’మేదీ?
రాజన్న ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరిస్తారు. కళ్లకు అద్దుకుని నోట్లో వేసుకుంటారు. తెలిసిన వారికి పంచి పెడతారు. అయితే, ఆహారభద్రత చట్టం ప్రకారం ఏ సంస్థ కూడా అనుమతి లేదా రిజిస్ట్రేషన్ పొందకుండా ఆహార వ్యాపారం నిరహించకూడదు. ఆహారాన్ని తయారు చేసే, ప్రాసెస్ చేసే, ప్యాకేజీలు చేసే లేదా పంపిణీ చేసే ఏదైనా సంస్థ తప్పనిసరిగా ‘ఫస్సై’ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందాలనేది నిబంధన. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ యేటా జాతీయ సర్టిఫికెట్ భోగ్ (బ్లిస్ ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్)ను అందిస్తుంది. ఇప్పటివరకు రాజన్న ప్రసాదానికి ఆ భోగం ఎందుకు దక్కడం లేదనేది వెయ్యి లడ్డూల ప్రశ్న.
పట్టించుకోని ఆలయ వర్గాలు
ప్రసాదం తయారీ.. గుర్తింపు విషయంలో ఆలయ వర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో లడ్డూ, ఇతర ప్రసాదాల్లో నలకలు, వెంట్రుకలు రావడం భక్తుల్లో నైరాశ్యం నింపింది. దీని ఫలితంగా భోగ్‌లో చేరడానికి అడ్డంకులు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఫుడ్‌సేఫ్టీ అధికారులు తరచూ ప్రసాదాల తయారీని అప్పుడప్పుడు పర్యవేక్షిస్తుండాలి. కానీ, వారు హోటళ్లు, రెస్టారెంట్లపై దాడుల్లో బిజీగా ఉంటున్నారేమో..? భక్తులకు అత్యంత ప్రీతికరమైన రాజన్న ప్రసాదం పట్ల చిన్నచూపు ప్రదర్శిస్తున్నట్లు పలువురు విమర్శిస్తు న్నారు. ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు, ఆలయ వర్గాల పర్యవేక్షణ కరువై ప్రసాదాల తయారీలో కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదనే వాదనలు ఉన్నాయి. దీంతో సర్కారు గుర్తింపునకు రాజన్న ప్రసాదం నోచుకోవడం లేదనే అభిప్రాయాలు వెల్లడవుతు న్నాయి. ఇప్పటికైనా ప్రసాదాల గుర్తింపునకు అధికారులు తగిన చొరవ తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
అనుమతులు తీసుకుంటాం
ఆలయంలో ప్రసాదాలకు ఫుడ్‌సేఫ్టీ అనుమతులు తీసుకుంటాం. దరఖాస్తు ప్రక్రియపై అధికారులతో చర్చిస్తున్నాం. పరిశుభ్రమైన వాతావరణంలోనే ప్రసాదాల తయారీ చేస్తున్నాం. పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వివరణ కోసం.. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఫోన్ లిప్ట్ చేయడం లేదు.
ప్రతాప నవీన్, ఆలయ ఏఈఓ (ప్రసాదాల విభాగం)






