రాజీవ్ విగ్రహం తొలగిస్తాం
- తెలంగాణ తల్లికి కేటాయించిన స్థానంలో రాజీవ్ విగ్రహమా?
- మేం అధికారంలోకి వచ్చాక ఎయిర్‌పోర్ట్ పేరు తొలగిస్తాం
- బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): తెలంగాణ అస్తిత్వాన్ని అవమా నపరిచే విధంగా తెలంగాణ తల్లి విగ్రహానికి కేటాయించిన ప్రదేశంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారక రామారావు మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాన్ని తొలగిస్తామని, స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. సోమవారం నందినగర్‌లోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపిలో సచివాలయం అస్తవ్యస్తంగా ఉండేదని, అగ్ని ప్రమాదం జరిగితే కూడా ఫైర్ ఇంజిన్ రాని పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు.
అవన్నీ చూసిన తరువాతే నాటి సీఎం కేసీఆర్ సచివాలయ పునర్నిర్మాణం చేపట్టారని తెలిపారు. తెలంగాణ పౌరుషం, తెలంగాణ వైభవాన్ని చాటేలా, తెలంగాణ భవిష్యత్తు తరాలకు అందించేలా అద్భుతమైన డిజైన్‌తో నిర్మాణం చేశామని వెల్లడించారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌కు అద్భుతమైన నివాళి అందించేలా మహనీయుడి అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, ఆయన పేరును రాష్ర్ట సచివాలయానికి పెట్టామని పేర్కొన్నారు.
సచివాలయంలో కూర్చుని పాలించే ప్రతి పాలకుడికి తెలంగాణ అమరవీరుల త్యాగాల స్ఫూర్తిని జ్వలింపజేసేలా అద్భుతమైన అమర జ్యోతి స్మారకం నిర్మించామని స్పష్టంచేశారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకైన తెలంగాణతల్లి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించాలన్న ఉద్దేశంతో ఒక ఐలాండ్ ని సచివాలయం ఎదురుగా రూపొందించామని, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లోనే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయం తీసుకుమని వెల్లడించారు.
కుసంస్కార పార్టీ కాంగ్రెస్
కాంగ్రెస్ కుసంస్కార పార్టీ అని, తెలంగాణ తల్లికి కేటాయించిన స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పెడుతుందని కేటీఆర్ విమర్శించారు. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి అంజయ్య పేరుతో ఉన్న పార్కు లుంబిని పార్క్ అయిందని, అదే అంజయ్య పార్కు ఎదురుగా ఆయనను అవమానించిన రాజీవ్‌గాంధీ విగ్రహం పెడుతున్నారని మండిపడ్డారు. పదేళ్లలో తాము ఏనాడూ రాష్ర్టంలో పేర్ల మార్పుపైన ఆలోచించలేదని చెప్పారు. అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్‌గాంధీ ట్రిపుల్ ఐటీకి, రాజీవ్ గాంధీ స్టేడియం, రాజీవ్ రహదారి, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇలా ఎన్ని పేర్లు ఉన్నా వాటిని మేము ఏనాడూ మార్చడానికి ప్రయత్నం చేయలేదని స్పష్టంచేశారు. నాలుగేళ్లలో తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అవమానించిన తరువాత బాధతోనే రాజీవ్ విగ్రహాన్ని అక్కడ నుంచి తరలిస్తామన్న చెప్తున్నామని స్పష్టంచేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్‌గాంధీ పేరును తొలగిస్తామని చెప్పారు. తెలంగాణ తల్లికి కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానాన్ని తెలంగాణ సమాజం మరిచిపోదని అన్నారు. ఇప్పటికే రాజీవ్‌గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలు సరిపోయినన్ని ఉన్నాయనీ, ఢిల్లీకి గులాములు గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పౌరు షం కలిగిన బిడ్డగా చెప్తున్నానని, వాటిని మార్చే దిశగా ఆలోచన చేస్తామని హెచ్చరించారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి తెలంగాణ మహనీయుడి పేరును పెడతామని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి.. జై తెలంగాణ అని ఏనాడు అనలేదని, మహనీయుడు అంబేద్కర్‌కు కనీసం పూలదండ వేయలేదని, కనీసం లైటింగ్ ఏర్పాటు చేయని కుసంస్కారి అని విమర్శించారు. అధిష్ఠానం దగ్గర మెప్పు కావాలి అంటే, రాహుల్ దగ్గర మార్కులు కొట్టేయాలి అంటే గాంధీభవన్‌లోను మరింత ఎక్కువ ప్రేమ ఉంటే రేవంత్‌రెడ్డి ఇంటిలో రాజీవ్ విగ్రహం పెట్టుకోవాలని సూచించారు.
రాఖీ పండగకు కవిత లేకపోవడం బాధకరం
తన సోదరి కవిత రాఖీ పౌర్ణమి రోజు తమతో లేకపోవడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. 155 రోజులుగా ఆమె ఏ వేదన అనుభవిస్తున్నారో.. దానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉన్నదని చెప్పారు. రాష్ర్ట ప్రజలందరికీ కేటీఆర్ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.






