5 వేల కోట్లతో 120 గురుకులాలు
- 30 ప్రదేశాల్లో త్వరలోనే నిర్మాణం
- స్థల సేకరణ, డిజైన్ త్వరగా పూర్తి చేయండి
- హాస్టల్లో ప్రతి విద్యార్థి మంచంపైనే పడుకోవాలి
- ఓవర్సీస్ స్కాలర్‌షిప్ నిధుల బాధ్యత అధికారులదే
- గురుకులాలపై సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఎడ్యు కేషనల్ స్కూల్ భవనాల నిర్మాణాల కోసం ఆయా నియోజకవర్గాల్లో కావాల్సిన స్థలాలను సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమ న్వయం చేసుకుని సేకరించి భవనాలు డిజైన్స్ వేయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.5 వేల కోట్లతో 30 కాంప్లెక్స్‌లలో 120 గురుకుల పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల ఉన్నతాధికారులతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
మానవ వనరులను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవడానికి ఈ ఏడాది బడ్జెట్‌లో విద్యకు పెద్దపీట వేశామని తెలిపారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నదని, అందుకు తగ్గట్టుగా అధికారుల పనితీరు ఉండాలని స్పష్టంచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 25 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో 10 నుంచి 15 ఎకరాల భూమిని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు కోసం సేకరించాలని ఆదేశించారు. 8 నెలల్లో ఈ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 100 శాతం అడ్మిషన్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రతి విద్యార్థి మంచంపైనే పడుకోవాలి
ప్రభుత్వ హాస్టళ్లలో, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి మంచంపైనే పడుకొనేలా సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ‘రాష్ట్రంలోని 1029 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు ఇప్పటివరకు మంచాలు, బెడ్స్, బెడ్ షీట్స్ ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎంత మందికి కావాలి? అనే జాబితాను త్వరగా తయారుచేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపండి’ అని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదనలు పంపిన తర్వాత పరిశీలించి వాటిని కొనుగోలు చేయడానికి కావాల్సిన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.
ప్రతి గురుకుల పాఠశాలతోపాటు ప్రభుత్వ హాస్టల్‌లో విద్యార్థులకు తప్పనిసరిగా టాయిలెట్స్, బాత్‌రూమ్స్, రన్నింగ్ వాటర్, విద్యుత్, వసతి గదులకు తలుపులు, కిటికీలు ఉండాలని, కిటికీల నుంచి లోపలికి దోమలు రాకుండా కచ్చితంగా మెష్ జాలీ ఏర్పాటు చేయాలని సూచించారు. వీటన్నింటిని క్రోడికరిస్తూ విద్యార్థుల సౌకర్యాల కల్పనపై చెక్ లిస్టు తయారుచేసి ఈ నెల 29వ తేదీలోగా పంపాలని ఆదేశించారు. చెక్ లిస్టును ప్రతి హాస్టల్లో ప్రదర్శించాలని తెలిపారు. గురుకుల భవనాల అద్దెలను త్వరలోనే చెల్లిస్తామని, భవనాల యజమానులు విద్యార్థుల సౌకర్యాల కల్పనకు నిబంధనల ప్రకారం పనిచేయాల్సి ఉంటుందని అన్నారు.
ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ విడుదలకు సానుకూలం
విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖలో పెండింగ్‌లో ఉన్న ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిల జాబితాను తనకు అందజేయాలని అధికారులకు సూచించారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి సంవత్సరం నిర్ణీత గడువులోగా ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ నిధులను విడుదల చేయించుకునే బాధ్యత అధికారులదేనని గుర్తు చేశారు. ఈ ఏడాది బీసీలకు 800, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 500 మంది విద్యార్థుల చొప్పున ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తామని ప్రకటించారు.
పెద్దాపూర్ పాఠశాలపై సమీక్ష
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన తర్వాత అక్కడ తీసుకున్న చర్యల గురించి గురుకులాల సెక్రటరీ రమణకుమార్‌ను ఆరా తీశారు. విద్యార్థులకు మంచాలు, బెడ్స్ యుద్ధ ప్రాతిపదికన అందజేయాలని ఆదేశించారు. ఆ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా కింద పడుకోవడానికి వీల్లేదని, ప్రస్తుతం ఉన్న భవనాలు సరిపోకుంటే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులోనే టాయిలెట్స్, బాత్‌రూముల నిర్మాణం జరగాలని అన్నారు. పాఠశాల చుట్టు ప్రహరీ గోడ నిర్మించాలని ఆదేశించారు. నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఇతర అధికారులు పాల్గొన్నారు.






