దంచికొట్టిన వర్షం
- రహదారులపై నిలిచిన నీరు
- పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
- దక్షిణ, మధ్య తెలంగాణపై ఉపరితల ద్రోణి ప్రభావం
- మరో ఐదు రోజుల పాటు వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 19 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం దంచికొట్టింది. సోమవారం మధ్యా హ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మబ్బులు కమ్మేసి భారీ వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, షేక్‌పేట, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, బహుదూర్‌పల్లి, సూరారం, సుచిత్ర, పేట్‌బషీరాబాద్, బహుదూర్‌పల్లి, గుండ్లపోచంపల్లి, జీడిమెట్ల, బోయిన్‌పల్లి, ఎర్రగడ్డ, ప్రగతినగర్, తిరుమలగిరి, బేగంపేట, అల్వాల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో రహదారులపై వర్షపు నీరు భారీగా చేరింది. జోరు వానతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో పాటు పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ముఖ్యంగా షేక్‌పేట ఫ్లుఓవర్‌పై వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతా బాద్, సుచిత్ర ప్రాంతాల్లోనూ రోడ్లపై వాహనాలు చాలా నెమ్మదిగా కదలాల్సి వచ్చింది. రాయదుర్గం, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బాలానగర్ ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన నీటిలో వాహనాలు కొట్టుకుపోయాయి. వర్షం కురిసిన ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీకి చెందిన డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. షేక్‌పేటలో అత్యధికంగా 5.3 సెంటీమీటర్లు, అత్యల్పంగా జీడిమెట్లలో 2.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
వాన నీటిలో చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సు..
నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద ఐదు అడుగుల మేర నీరు ప్రవహించింది. దీంతో ఓ ఆర్టీసీ బస్సు నీటి ప్రవా హంలో చిక్కుకుపోయింది. ప్రయాణికులు బస్సు నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు యువకులు ఈదు కుంటూ బయటకు రాగా, మహిళలు, వృద్ధు లు, ఈతరాని వారు బస్సులోనే ఉండిపోయారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులు బయటకు వచ్చేందుకు సహకరించారు. నీటి ప్రవాహాన్ని గమనించకుం డా డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్మల్‌లో రోడ్లన్నీ జలమయం..
నిర్మల్: నిర్మల్ పట్టణంలో సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. జిల్లా ఎస్పీ జానకి స్వయంగా శివాజీ చౌక్‌లో ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.
ఉపరితల ద్రోణి ఎఫెక్ట్‌తో..
- రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
- ‘విజయక్రాంతి’తో వాతావరణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రావణి
హైదరాబాద్: ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రావణి సోమవారం ‘విజయక్రాంతి’కి వెల్లడించారు. దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాలపై ఉపరితల ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆమె చెప్పారు. ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లా ల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఆవర్తనం కారణంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు.
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
మరో ఇద్దరికి తీవ్ర అస్వస్థత
గద్వాల (వనపర్తి)/అలంపూర్: గద్వాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే పిడుగులు పడడంతో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు రైతులు, ఒక ఎద్దు మృత్యువాత పడడంతో పాటు మరో ఇద్దరు రైతులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ ఎద్దు సైతం అస్వస్థత బారినపడింది. అలంపూర్ మండలం క్యాతూరు గ్రామానికి చెందిన రైతు వేముల రాజు (40) పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.
అదేవిధంగా ఉండవల్లి మండలం కంచుపాడుకు పింజరి ఖాజామియా, షాలిబి దంపతులు పొలంలో పనులు చేస్తున్న క్రమంలో పిడుగు పడడంతో ఎద్దు మృతిచెందగా, మరో ఎద్దుతో పాటు రైతు దంపతులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అదేవిధంగా గద్వాల నియోజకవర్గ పరిధిలోని గట్టు మండలం అరగిద్దకు చెందిన నల్లారెడ్డి (38), మల్దకల్ మండల కేంద్రానికి చెందిన ఆదిలక్ష్మి(28) తమ పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించారు.






