రాజీనామా ఇస్తా! అసెంబ్లీలో రాకేశ్ రెడ్డి సంచలన ప్రకటన

16-09-2026 | 11:36am

నిజామాబాద్ అంటే ఎవరికీ పట్టని జిల్లాగా మారింది

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) ఏడో రోజు ప్రారంభమై కొనసాగుతున్నాయి. నిజామాబాద్ అంటే ఎవరికీ పట్టని జిల్లాగా మారిందని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి(BJP MLA Paidi Rakesh Reddy) శాసనసభలో ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం కాలం నాటి తహసీల్దార్, సబ్ కలెక్టర్ కార్యాలయాలున్నాయని తెలిపారు. రెండేళ్లుగా అధికారులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు రాకేశ్ రెడ్డి స్పష్టం చేశారు. 

భవనం కూలిపోతే కానీ ఇవ్వబోమని అనుకుంటున్నారో తెలియదన్నారు. అవసరమైతే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఎంతకాలం మోసాలు చేస్తారో అర్థం కావట్లేదన్నారు. మంథిని, ములుగు, కొడంగల్ కు ఎన్ని నిధులు వెళ్తున్నాయి? అని ప్రశ్నించారు. చిన్న చిన్న కోరికలు కోరితే సభ్యలకు బాధగా ఉందన్నారు. నిజాంసాగర్ నీళ్లతో పండిన ప్రాంతంలో కరువుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ లో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ కార్యాలయం(Integrated Revenue Office) నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

భవనాల కోసం తొలి విడతలో రూ. 600 కోట్లు మంజూరు చేశాం

రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) స్పందిస్తూ... ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల కోసం విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. కొన్ని చెట్ల ఎమ్మార్మో ,ఆర్డీవో కార్యాలయాలు పురాతన భవనాల్లో నడుస్తున్నాయని వెల్లడించారు. భవనాల కోసం తొలి విడతలో రూ. 600 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఇప్పటికే కొన్ని మంజూరు చేసి.. కొన్ని టెండర్ల దశలో ఉన్నాయని తెలిపారు. ఆర్మూర్ లో ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైన చోట కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయం(Adilabad Collectorate Office) త్వరలో పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు