calender_icon.png 1 November, 2024 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెహ్రూ హయాం నుంచే రామరాజ్యం

23-04-2024 01:31:55 AM

l రక్తపాతం లేకుండా దేశానికి స్వాతంత్య్రం 

l టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

హైదరాబాద్, ఏప్రిల్ 22(విజయక్రాంతి): నెహ్రూ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో శ్రీరాముడి పాలన మొదలైందని, రాముడి పాలనకు అప్పుడే పునాది పడిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. నెహ్రూ పాలనను తప్పుపట్టే వాళ్లు అప్పుడే జన్మించి ఉంటే బాగుండేదన్నారు. బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ నిన్నమొన్ననే పుట్టారని ఆయన ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబంలోనే త్యాగం ఉందనే విషయం తెలుసుకోవాలని జగ్గారెడ్డి చెప్పారు. గాంధీభవన్‌లో సోమవారం మాట్లాడుతూ.. నెహ్రూ, గాంధీ కుటుంబాల చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియాలంటే పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళతానని జగ్గారెడ్డి చెప్పారు.

రక్తపాతానికి తావు ఇవ్వకుండా శాంతి మార్గాన్నే నమ్మారని, గాంధీ 16 ఏళ్లు జైలు జీవితం గడిపారని ఆయన వివరించారు. స్వాతంత్య్రం వచ్చాక నెహ్రూ ఏకగ్రీవంగా మొదటి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని, ఆ చరిత్రను కాదనే శక్తి బీజేపీకి లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఆకలి చావులు ఉండొద్దని సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని, మన రాష్ట్రంలో  నాగార్జున సాగర్, శ్రీశైలం తదితర ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందన్నారు. పారిశ్రామిక రంగం, పంచవర్ష ప్రణాళికలు, విదేశీ వ్యవహారాలతో పాటు హైదరాబాద్‌కు అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, 60 లక్షల కిలోమీటర్ల రోడ్లు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయన్నారు. విదేశాలకు ఆహారం సరఫరా చేసే పరిస్థితికి దేశాన్ని తీసుకెళ్లారని చెప్పారు. ఈ విషయాలను కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తెలుసుకోవాలన్నారు. తాను లేవనెత్తే అంశాలపై చర్చకు వచ్చే దమ్ముందా? అని నిలదీశారు. కుల, మతాలకు అతీతంగా కాంగ్రెస్ పాలన చేస్తుందని తెలిపారు.