రామచంద్రయ్య కన్నుమూత
ఆదివాసీలకు చిరస్మరణీయుడు
- కంచుమేళం కళాకారుడిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత
- కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో సతమతం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 23 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బావి కూనవరం గ్రామానికి చెందిన సకినీ రామచంద్రయ్య (65) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో ఇబ్బంది పడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం పరిస్థితి విషమించ డంతో మృతిచెందారు. ఆదివాసీ జాతికి ఆయన చేవలు చిరస్మరణీయం.
ఆదివాసీ జాతి సంస్కృతి సంప్రదాయాలు, జాతులు, గోత్రాలు, తెగలు అన్ని కూలంకశంగా తెలిసిన కళాకారుడు. తన కంచుమేళంతో గిరిజనులందరికీ సుపరిచితుడయ్యారు. కంచుమేళం వాయిస్తూ ఆదివాసీ తెగల కథలు చెప్పే కళాకారుల్లో చిట్టచివరి వాడిగా రామ చంద్రయ్య గుర్తింపు పొందారు. ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క జాతరలో ప్రధాన ఘట్టమైన చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చే సమయంలో ఆయన కీలకంగా వ్యవహరించేవారు. ఆయన ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారం అందజేసి సత్కరించింది. కోటి రూపాయల నజరానా, జిల్లా కేంద్రంలో 426 గజాల ఇంటి స్థలాన్ని ఆప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇప్పటివరకు అది ఆయనకు అందలేదు. అనేక మార్లు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకొన్నారు.
ప్రోత్సాహక నగదు అంది ఉంటే..
2022 జనవరి 25న రాష్ట్రపతి చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు పొందిన తన తండ్రికి ప్రొత్సాహక నగదు అంది ఉంటే కొంతకాలం వైద్య సేవలు పొందుతూ బతికి ఉండే వారని ఆయన కుమారుడు బాబురావు రోధిస్తూ చెప్పారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఊపిరితిత్తుల వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడని, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండే సరికి పలుచోట్ల రూ.14లక్షలు వరకు అప్పు చేసి ఖమ్మం,హైదరాబాద్, విజయవాడ దవాఖానల్లో చికిత్స చేయించామని ఆవేదన వ్యక్తంచేశారు. మృతునికి భార్య బాపనమ్మ, కుమారుడు బాబురావు, కుమార్త్తె వాణి, వసంత, సుమలత ఉన్నారు.
పలువురు ప్రముఖుల సంతాపం
రామచంద్రయ్య మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పినపాక ఎమ్మేల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఫోన్‌లో మృతుని కుమారుడు బాబురావుతో మాట్లాడారు. వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్ రామచంద్రయ్య భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు.
జానపద కళకు తీరని లోటు
అంతరించిపోతున్న డోలు వాయిద్యానికి జీవం పోసి, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడిన పద్మశ్రీ రామచంద్రయ్య మృతి జానపద కళకు తీరని లోటని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వారసత్వంగా వచ్చిన గిరిజన సంప్రదాయ కళను జీవనాధారంగా చేసుకుని డోలు వాయిద్యానికి రామచంద్రయ్య దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించిపెట్టారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన రామచంద్రయ్య రాష్ట్రానికి తనడోలు వాద్యంతో కీర్తిని సాధించిపెట్టారని అన్నారు.






