6 May, 2026 | 1:08 PM

లేని ధాన్యానికి టెండర్లు?

24-06-2024 12:53 AM

35 లక్షల టన్నుల ధాన్యానికి ప్రభుత్వం టెండర్లు

క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయని అధికారులు

మిల్లర్ల వద్దకు వెళ్లడానికే జంకుతున్న వైనం

ఇప్పటికే 60 శాతానికిపైగా మాయమైన ధాన్యం

పౌరసరఫరాల శాఖపై బడా మిల్లర్ల ఆధిపత్యం

నిజామాబాద్ ఘటనతో తేటతెల్లం 

హైదరాబాద్, జూన్ 2౩ (విజయక్రాంతి): ఖరీఫ్ (వానకాలం).. రబీ (యాసంగి).. పంట కాలం ఏదైనా కానీ.. అలాగే బీఆర్‌ఎస్.. కాంగ్రెస్.. ప్రభుత్వాన్ని నడిపేది ఏ పార్టీ అయినా గానీ.. ఐఏఎస్ అధికారి.. ఐపీఎస్ అధికారి.. ఎవరు వచ్చినా.. రాష్ట్రంలోని బడా రైస్ మిల్లర్లదే ఆధిపత్యం కనపడుతోంది. క్షేత్రస్థాయిలో ధాన్యం మాయమవుతోంది.. పెద్ద మిల్లరు వారి స్థాయిని బట్టి వచ్చిన ధాన్యం వచ్చినట్టుగా మాయం చేస్తున్నారు. దీనిపై పౌరసరఫరాల శాఖలో కాస్త చలనం కనపడినట్టు అనిపించినా.. రైస్ మిల్లర్ల అసోసియేషన్ల ఆధిపత్యం కారణంగా మళ్లీ నిస్తేజంగా మారిపోతోంది.

35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు..

ఈ మధ్య కాలంలో అధికార, ప్రతిపక్షాల మధ్య నలిగి, రాజకీయ విమర్శలకు దారితీసిన సమస్య 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి ఈతూటెండర్లు పిలవడం. 2022 రబీ (యాసంగి) సీజన్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి సేకరించిన సుమారు 35 లక్షల ధాన్యం 28 జిల్లాల్లోని 1,832 రైస్ మిల్లులు/గోదాముల్లో ఉంది. మొత్తం 12 లాట్లుగా ఉన్న ధాన్యంలో 11 లాట్లు ఒక్కోటి 3 లక్షల మెట్రిక్ టన్నులు. ఒక లాట్‌లో 1.59 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నట్టుగా పేర్కొంటూ ఈ-టెండర్లను 2024 జనవరి 25న పౌర సరఫరాల శాఖ పిలిచింది.

ఇందుకు ఈఎండీగా ఒక్కో లాట్‌కు రూ.17.55 కోట్ల చొప్పున చెల్లించాలని టెండర్‌లో తెలిపింది. టెండర్‌ను జనవరి 25, 2024 జారీ చేయగా.. ఫిబ్రవరి 7న టెండర్ దాఖలుకు ఆఖరు తేదీగా నిర్ణయించారు. ఈ మధ్య కాలంలో టెండర్‌దారులు మిల్లులకు వెళ్లి ధాన్యాన్ని పరిశీలించుకోవచ్చని రాష్ట్రవ్యా ప్తంగా ధాన్యం నిల్వ ఉన్న మిల్లుల జాబితాను టెండర్‌లోనే ఇచ్చారు. పౌరసరఫరాల శాఖ కేవలం రికార్డుల్లో.. కాగితాలపై మాత్రమే 35 లక్షల టన్నుల ధాన్యానికి టెండర్లు పిలిచింది. కానీ క్షేత్రస్థాయిలో ధాన్యం మిల్లర్ల వద్ద ఉన్నదా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి.  

తనిఖీలు చేసేందుకు వణుకు

రైస్ మిల్లుల్లో ధాన్యం ఉందా లేదా అనేది తనిఖీ చేసేందుకు సివిల్ సప్లు శాఖలో ప్రత్యేకంగా విజిలెన్స్ ఉంది. కానీ ఇటు శాఖ అధికారులుగానీ.. అటు విజిలెన్స్ గానీ.. తూతూమంత్రంగా తనిఖీలు చేస్తూ.. అంతా ఓకే అన్నట్టుగా రికార్డుల్లో రాస్తున్నారు. మిల్లర్లతో మిలాఖత్ అవుతున్నారు. ఇలా పభుత్వం ఇచ్చిన ధాన్యం పక్కదారి పడుతున్నదనే ఆరోపణలపై విచారించి కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ డీఎస్‌వో, డీఎంలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ జిల్లాలో వాస్తవాలను తెలుసుకొనేందుకు రహస్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సారథ్యంలో తనిఖీ బృందాల ను ఏర్పాటు చేశారు. కానీ ఈ విషయాన్ని తెలుసుకున్న నిజామాబాద్ బడా రైస్ మిల్లర్లు విజయవంతంగా అడ్డుకున్నారు. తనిఖీ బృం దాలు వచ్చి కలెక్టర్‌తో మాట్లాడి తిరిగి వెనక్కి వెళ్ళిపోయాయి. అంటే రైస్ మిల్లర్లు సివిల్ సప్లు శాఖపై ఎంత పట్టు బిగించారో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక్క నిజామాబాద్‌లోనే కాదు.. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి నెలకొంది.

60 శాతం ధాన్యం మాయం!

ప్రభుత్వం టెండర్లు పిలిచిన 35 లక్షల టన్నుల ధాన్యంలో కూడా మిల్లర్లు మాయాజాలం ప్రదర్శించినట్టుగా అధికారులే అంగీక రిస్తున్నారు. రికార్డుల్లో మాత్రం 35 లక్షల టన్నుల ధాన్యం ఉన్నట్టుగా కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో ఇందులో 60 శాతం ధాన్యం మాయమైనట్టు అనుమానిస్తున్నారు. అందు కే టెండర్లలో ‘మీరు వెళ్లి స్టాక్‌ను పరిశీలించుకొండి’ అని సూచనలు చేశారే తప్ప.. కచ్చితంగా 35 లక్షల మెట్రిక్ టన్నులు ఉందా.. లేదా అనేది మాత్రం చెప్పలేదు. ఎప్పుడో 2022 రబీలో రైతుల నుంచి సేకరించిన ధాన్యం.. సంవత్సరం తరువాత ఎంత వరకు ఉంది? రికార్డుల్లో కనిపిస్తున్నదంతా క్షేత్రస్థాయిలో ఉందా? ఎంత మాయమయ్యింది? దీనికి బాధ్యులెవరు? అనే అంశంపై సివిల్ సప్లు అధికారులు మాట్లాడటం లేదు.

కఠిన చర్యలు అవసరం..

సంవత్సరాలుగా ప్రభుత్వం ధాన్యం సేకరించి మిల్లర్లకు అప్పగిస్తుంటే.. మిల్లర్లు మాత్రం ధాన్యాన్ని మాయం చేస్తున్నారు. ఇలా దాదాపు రూ.౨౦ వేల కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్టు సమాచారం. ఎప్పుడైనా సర్కారు గట్టిగా అడిగితే రేపు మాపు అంటూ ప్రభుత్వానికే చుక్కలు చూపిస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించకుండా.. తూతూ మంత్రంగా తనిఖీల పేరుతో.. రికార్డులను తిరగరాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అంశంపై కఠినంగా వ్యవహరించకపోతే.. పౌరసరఫరాల శాఖ మరింత నష్టాల్లో మునిగిపోవడం ఖాయం. ఇచ్చిన ధాన్యాన్ని రాబట్టుకోవడం, అసలు క్షేత్రస్థాయిలో ఏయే మిల్లర్ల వద్ద ఎంత ఉందనేది తెలుసుకుంటే ఆపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ బాటలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంత్రి అయిన తర్వాత, ఆ శాఖ కార్యదర్శి డీఎస్ చౌహాన్ ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. 

మాయమైన ధాన్యానికి టెండర్లా!

టెండర్లు పిలిచిన  ధాన్యంలో 60 శాతం వరకు ఇప్పటికే మాయమైనట్టు అనుమానాలున్నాయి. ఇది బయటకు రాకుండా జిల్లాల్లోని అధికారులను మిల్లర్లు మచ్చిక చేసుకుం టున్నారు. అదే సమయంలో సివిల్ సప్లు ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులపై రైస్ మిల్లర్లు రాజ కీయంగా ఒత్తిడి తెస్తూ.. తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటున్నా రనే ఆరోపణలు వినపడుతున్నాయి. అయితే ఆ విషయం బయటకు చెప్పకుండా, తనిఖీలు నిర్వహించకుండా రికార్డుల్లో ఉన్న 35 లక్షల మెట్రిక్ టన్నులకు టెండర్లు పిలిచినట్టు తెలుస్తున్నది. అంటే లేని ధాన్యానికి టెండర్లు పిలిచారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.