6 May, 2026 | 3:11 PM

అధునాతనంగా గురుకులాలు

24-06-2024 12:45 AM
  1.  ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్
  2.  అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష
  3.  పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిరలో ఏర్పాటు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలోని  ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను అధునాతనంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రతీ శాసనసభ నియోజకవర్గంలో వేర్వేరు చోట్ల కాకుండా ఓకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లను ప్రభుత్వం నిర్మించనుంది. అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్‌ల నిర్మాణం చేపట్టనుంది. దశలవారీగా నియోజకవర్గాల్లో ఈ క్యాంపస్‌లను ప్రభుత్వం నిర్మించనుంది.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ ఏర్పాటు కోసం సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి, అధికారులతో ఆదివారం సమీక్షించారు.. ఈ సందర్భంగా ఆర్కిటెక్చర్లు రూపొందించిన పలు నమూనాలను సీఎం, డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం ఒకే చోట ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటుతోపాటు విద్యార్థులకు నాణ్యమైన వసతులు ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. నాణ్యమైన విద్యా బోధనకు అధునాతన భవనాలు నిర్మించాలని చెప్పారు. ఇంటర్నేషనల్ స్కూళ్లకు దీటుగా భవనాలను నిర్మించాలన్నారు. అందుబాటులో ఉన్న స్థలాలకు అనుగుణంగా నమూనాలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. 

కుల, మత వివక్ష తొలగించాలనే సంకల్పం

ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటు కోసం ఇప్పటికే కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటు కోసం ప్రభుత్వం 20 ఎకరాల చొప్పున సేకరించింది. ఒకే చోట ఇంటిగ్రేటెడ్ భవనాలను నిర్మించి మినీ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో కుల, మత వివక్ష తొలగించాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా నిర్వహించే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.