31 August, 2026 | 2:56 PM

ఆధునిక చిత్ర నగరి రామోజీ ఫిలిం సిటీ

09-06-2024 02:04 AM

 ఆధునిక చిత్ర నగరి రామోజీ ఫిలిం సిటీ 

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్‌ఎఫ్‌సీ

స్క్రిప్టుతో వస్తే ప్రింట్‌తో వెళ్లేలా సకల ఏర్పాట్లు

పర్యాటకానికీ ఊపు తీసుకువచ్చిన రామోజీ

ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం సిటీగా గిన్నీస్ రికార్డు

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరానికి, తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన నిర్మాణాల్లో రామోజీ ఫిలిం సిటీ ఒకటి. 1996లో ప్రారంభమైన రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరగకుండా ఏ సినిమా నిర్మాణం పూర్తవ్వదు అన్నంతగా పరిస్థితి మారిపోయింది. సినిమా నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా రామోజీ ఫిలిం సిటీనే నిర్మాతలు, దర్శకులు ఎంచుకునేంత గొప్పగా నిర్మించారు రామోజీరావు.

కొండలు, గుట్టలు, బండలు, పడావు భూములను ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన చిత్రనగరిగా రూపుదిద్దిన దార్శనీకుడు ఆయన. అద్భుతమైన కట్టడాలు, రమణీయ వనాల సమాహారంగా ఆర్‌ఎఫ్‌సీ తన ప్రత్యేకతను చాటుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రనగరిగా గిన్నీస్ రికార్డు సాధించిందంటే ఇందులో రామోజీ గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆయన భౌతికంగా మన ముందు లేకున్నా ఆర్‌ఎఫ్‌సీ పేరుతో చిరస్థాయిగా నిలిచిపోతారు.

వినోదం, సినీ మాయాజాలం

సినీ పరిశ్రమ సిగలో సింగారాల పువ్వుగా, పర్యాటకుల పెదవులపై సంబరాల నవ్వుగా రూపుదిద్దుకున్న అపురూప చిత్రనగరం రామోజీ ఫిలిం సిటీ, ప్రస్తుతం ఇది ఓ అంతర్జాతీయ అద్భుతం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా గిన్నీస్ రికార్డు సాధించిందీ మాయా ప్రపంచం. దేశ, విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ సొగసుల సముదాయం ఏకంగా 5 కోట్ల పనిదినాలతో రూపుదిద్దుకున్నది. ప్రత్యక్షంగా 7,500 మందికి ఉపాధిని అందిస్తున్న ప్రాంతంగా నిలిచింది.

సుమారు రెండు వేల ఎకరాలకు పైబడిన సువిశాల ప్రదేశం అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు పన్ను చెల్లించిన విస్తృత వ్యాపార కేంద్రంగా పేరుగాంచింది. హైదరాబాద్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని అనాజ్‌పూర్‌లో నిర్మించిన రామోజీ ఫిలిం సిటీ సందర్శిస్తే కానీ జంటనగరాల వీక్షణ పూర్తికాదని పర్యాటకులు భావించే అద్భుత కళాఖండం. ఫిల్మీ సైట్‌లు, ఫన్ రైడ్‌లు, గేమ్ జోన్, డెయిలీ లైవ్ షోస్, హౌ యాక్షన్ స్టంట్స్, సిగ్నేచర్ హాస్పిటాలిటీ, స్టూడియో టూర్, ఎకో టూర్, వెడ్డింగ్, హనీమూన్, కార్పొరేట్ ఈవెంట్స్, విహారయాత్రలు, థీమ్ పార్టీలకు వేదికగా ఆర్‌ఎఫ్‌సీ నిలిచింది. 

స్క్రిప్టుతో రండి, ప్రింట్‌తో వెళ్లండి.. 

తెలుగు, హిందీ, బెంగాలీ, ఒడియా, మలయాళం, తమిళం, కన్నడ, మరాఠీ, అస్సామీ, బంగ్లా, భోజ్‌పురి, ఇంగ్లీష్ ఇలా విభిన్న భాషలకు చెందిన వేలాది చిత్రాలు రూపుదిద్దుకున్న ఈ ఫిలిం సిటీ గురించి ఏ సినీ ప్రముఖుడిని అడిగినా ఒకటే చెబుతారు ‘మనలో సత్తా ఉండాలేగానీ రామోజీ ఫిలిం సిటీలో సదుపాయాలకు కొదువ లేదని’.. అవును అది అక్షరాలా నిజం. ఏకకాలంలో 20 సినిమాలు నిర్మించినా ఎక్కడా ఆగాల్సిన అవసరం లేకుండా ఆగమేఘాల మీద అమర్చే సౌకర్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా రామోజీ ఫిలిం సిటీ నిలుస్తోంది. హాలీవుడ్ స్థాయిలో నిలిచే అత్యాధునిక సామగ్రిని సమకూర్చుకున్న విస్తృత దృక్పథానికి కొలువు. లోపలికి అడుగు పెడుతూనే ఆ సంగతి అర్థమైపోతుంది.

అటు చూస్తే చరిత్రకు అద్దంపట్టే కోట.. ఇటు చూస్తే అబ్బురపరిచే హవా మహల్ బాట.. ఆ వైపు అమెరికా ఓల్డ్ వెస్ట్ వీధి సందళ్లు.. ఈ వైపు అలనాటి మొఘల్ సామ్రాజ్యపు ఆనవాళ్లు.. “స్క్రిప్టుతో రండి- తుది ప్రింట్‌తో వెళ్లండి” అనేలా ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి. సినిమా అంటే మాటలు కాదు ఎన్నో సన్నివేశాలు, ఎన్నెన్నో వేషాలు, మరెన్నో అవసరాలు ఇంకెన్నో పరిసరాలు. అన్నింటినీ కలిపి ఒకేచోట అందిస్తామనేది ఏమాత్రం అతిశయోక్తి కాదని, అత్యంత నిబ్బరంగా చెప్పగలిగిన ఆత్మవిశ్వాసపు శక్తిగా ఫిలిం సిటీని తీర్చిదిద్దారు. రామోజీ ఫిల్మ్ సిటీలో రూపుదిద్దుకున్న తొలి సినిమా మా నాన్నకు పెళ్లి. ఇప్పటి వరకు సుమారు 2,500కు పైగా సినిమాలు నిర్మించారంటే ఈ స్థలం ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. 

వర్షం కావాలన్నా, పెనుగాలులు వీయాలన్నా...

అత్యాధునిక లైటింగ్ వ్యవస్థ రామోజీ ఫిలిం సిటీ సొంతం. అత్యద్భుత శబ్ద విన్యాసాలు సిద్ధం. అంతర్జాతీయ స్థాయిలో పనిచేసే కెమెరాలను వినియోగించుకోవాలన్నా సర్వం సంసిద్ధం. క్రేన్లు, డోలీలు, ట్రాలీలు, కదిలే జనరేటర్లు, ఆడియో పరికరాలు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇక వర్షం ఎఫెక్ట్ కావాలన్నా, చిటికెలో పెనుగాలులు వీయాలన్నా, మెరుపులు, పొగమంచు, పొగ, బుడగలు, రాత్రివేళ పగలు కావాలన్నా, పగటిపూట చీకట్లు అలుముకోవాలన్నా ఎల్లవేళలా అన్నీ సిద్ధంగా ఉంటాయి. అన్నింటికీ మించి ఎర్త్ స్టేషన్ ఇక్కడొక ప్రత్యేక ఆకర్షణ.

ఇలాంటి వ్యవస్థను ఓ ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించడం దేశంలో ఇక్కడే ప్రథమం. కుమార్తె పెళ్లి వేడుకలు అపురూపంగా నిర్వహించాలనుకున్నా, కార్పొరేట్ సమావేశాన్ని అబ్బురపరిచేలా జరపాలనుకున్నా రామోజీ ఫిలిం సిటీకి రావాల్సిందే. 20 మంది నుంచి 2,000 మంది వరకు సరిపోయే సమావేశ మందిరాలు ఉన్నాయి. ఆరుబయట ఆస్వాదించాలనుకుంటే ఎలాంటి సందర్భానికైనా వేలాది మందికి సరిపడా వసతులు ఉన్నాయి. అంతేకాదు రెయిన్‌బో గుండు సూది నుంచి హెలికాఫ్టర్ వరకు ఏది కావాలన్నా సమకూర్చే పరేడ్, స్టార్ హోటళ్లు తార, సితారతోపాటు సినిమా యూనిట్ సభ్యులకు బస కల్పించే సహారా హోటల్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా హెలికాప్టర్లో ఫిలిం సిటీకి రావాలనుకుంటే హెలిప్యాడ్ కూడా ఉండటం విశేషం.

అనుభూతుల స్వర్గం..

ఇదంతా ఒక ఎత్తు అయితే ఫిలిం సిటీ అందాలన్నీ మరో ఎత్తు. పిల్లలకిది కేరింతల కేంద్రం. పెద్దలకిది అనుభూతుల స్వర్గం. నవ దంపతులకిది మధుర విహారాల ప్రదేశం. ఎటు తల తిప్పినా సుందర నందన వనాలే. వేలాది సుమ సోయగాల నిలయాలే. పిల్లల్ని అలరించే పండుస్థాన్ చూస్తే పెద్దలు కూడా వయసు మర్చిపోతారు. “థ్రిల్ విల్లే”లో తుళ్లిపడే పిల్లల కోసం సాహసాలు, సరదాలు, మజానిచ్చే రైడ్లు, ట్విస్టర్లు, రేంజర్లు అబ్బో చెప్పాలంటే బోరాసురలో అడుగుపెడితే సరి. ఇది ఆసియాలోనే అపురూపమైనది మరి.

ఇంకా ట్రైన్ రెస్టారెంట్, దాదాజిన్ ఆర్క్ వీడియో గేమ్స్ పార్లర్, టింబర్ల్యాండ్, డోమ్ యాంపి థియేటర్ ఎంథ్రాలర్ ఇవన్నీ చూస్తే పిల్లలు ఎగిరి గంతేస్తారు. మొత్తానికి రామోజీ ఫిలిం సిటీ ఒక సొగసుల లోకం. సోయగాల స్వప్నం. అందుకే ఏటా ఆర్‌ఎఫ్‌సీని సందర్శించే వారి సంఖ్య సుమారు 15 లక్షలకు పైగానే. రామోజీరావు లేకున్నా ఆర్‌ఎఫ్‌సీ మాత్రం ఆయన గుర్తుగా ప్రపంచానికి వినోదాన్ని పంచుతూనే ఉంటుంది.

విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌కు వెళ్లాలన్నా.. 

పారిస్ అందాలు, ఇంగ్లండ్ సొగసు లు, రోమ్ సోయగాలు, బాగ్దాద్ వైభవా లు, న్యూయార్క్ వైభోగాలు అన్నింటికీ చిరునామా రామోజీ ఫిలిం సిటీలోని ప్రి న్స్ స్ట్రీట్. అడవుల మధ్య ఏకాంత ప్రదేశం కావాలన్నా, అత్యాధునిక ఆకాశహర్మ్యాలు కావాలన్నా, రమణీయ పౌరాణిక నేపథ్యానికి అనువైన సుందర సౌధాలు కావాలన్నా అన్నీ ఒకేచోట లభ్యమవుతాయి. విమానాశ్రయంలో చిత్రీకరణ చేయాలనుకున్నా, రైల్వే స్టేషన్ కావాలన్నా, రైలులో షూటింగ్ జరపాలన్నా, ఆసుపత్రిలో షూటింగ్ జరపాలనుకున్నా, జైలు కావాలన్నా, ఆలయ ప్రాంగణం అవసరమైనా ఇలా ఒకటా, రెండా వందలాది లొకేషన్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

చిన్నాపెద్ద కలిపి వందలాది స్టూడియో ప్రాంగణాలు. సువిశాలమైన షూటింగ్ ఫ్లోర్లు ఉన్నాయి. సినిమా క్లుమైక్స్ కోసం విధ్వంసం సృష్టించాలన్నా, అందుకు తగిన ఏర్పాట్లు. బాంబులు పేలి కార్లు గాల్లోకి లేవాలన్నా, అపార్ట్మెంట్ మొత్తం అగ్నిప్రమాదంలో తగుబడిపోతున్నట్లు చిత్రీకరించాలన్నా, ఒక్కమాట చెబితే చాలు అందుకు అనుగుణంగా అల్లుకుపోయే సిబ్బంది అందుబాటులో ఉంటారు. విధ్వంసం నుంచి బయటపడి ప్రశాంత వాతావరణంలోకి కెమెరాను తిప్పాలనుకుంటే అందాల గ్రామం అలరిస్తుంది.

ఆలయ నేపథ్యం కావాలంటే ఆగమశాస్త్రబద్ధంగా నిర్మించిన గుడి ప్రాంగణం ఉంది. అందులో ఏ దేవుడినైనా ప్రతిష్టించుకోవచ్చు. దేవతా విగ్రహాలన్నీ సర్వాంగ సుందరంగా తయారై సిద్ధంగా ఉంటాయి. ఇవేమీ కాదు సరికొత్త లోకం కావాలనుకుంటే, ఆ ఊహలేంటో చెబితే చాలు, ఆ లోకాన్ని సాకారం చేసి కళ్లముందు నిలుపుతారు. ఎందుకంటే ఏ కళారూ పాన్నునా, ఏ అపురూప శిల్పాన్నునా, ఎలాంటి కట్టడాన్నునా నిర్ణీత సమయంలో రూపొందించే కళాకారులు, శిల్పకారులు, ప్రతిభావంతులు ఇక్కడ సదా సిద్ధంగా ఉంటారు.