ఏజెన్సీ వాసులకు వాగు గండం
రోహిణి కార్తె ముగిసింది..
మృగశిర అరుదించింది. తొలకరి పలకరించింది. ఇక వాన కాలం వచ్చేసింది. వానలు మొదలైందంటే చాలు.. ఏజెన్సీవాసుల్లో వణుకు మొదలవుతుంది. భారీ వర్షం కురిస్తే మారుమూల ప్రాంతాల్లోని వాగులు ఉప్పొంగి జన జీవనం స్తంభించిపోతుంది. విద్యార్థులు బడికి పోవాలన్నా, అత్యవసరంగా వైద్యం పొందాలన్నా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ.. తమకు మాత్రం అగచాట్లు తప్పడం లేదని ఏజెన్సీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉధృతంగా వానలు మొదలు కాకముందే నిర్మాణ దశలో ఉన్న బ్రిడ్జిలు, కల్వర్టులు, చప్టాలు పూర్తి చేయాలని కోరుతున్నారు. అవసరమైన చోట వెంటనే వంతెనలు నిర్మించాలని
వేడుకుంటున్నారు.
సూర్యాపేట/కుమ్రం భీం ఆసిఫాబాద్ / నాగర్‌కర్నూల్, జూన్ 8 (విజయక్రాంతి): కుమ్రంభీం జిల్లా ఏజెన్సీ జిల్లా. ఇక్కడి ఏజెన్సీలో ఏటా వానకాలంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తాయి. దీంతో మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపో తాయి. సమస్యలకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపడంతో ఏటా ఏజెన్సీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేం ద్రానికి కూతవేటు దూరంలో ఉన్న గుండి గ్రామానికి వెళ్లేందుకు వానకాలంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. వాగు ఏటా పొంగుతుండడంతో గ్రామస్తులు గత ఏడాది అనేకసార్లు ఆందోళనలు చేపట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బ్రిడ్జి నిర్మిస్తేనే ఓటు వేస్తామని ధర్నా చేశారు. అధికారులు నచ్చజెప్పి, ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారే తప్ప బ్రిడ్జి నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాగు ఉప్పొంగితే చిర్రకుంట, వట్టివాగు, దాంపూర్, తుంపల్లి, గుడేఘట్, కోసార, ఉల్లిపిట్టతోపాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి.
అలాగే వాడిలొద్ది వాగు పొంగితే చిలకలగూడ, సంతోష్‌గూడ, చౌపన్‌గూడ, సుద్ధ ఘట్, తడవగూడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. చింతలమానేపల్లి మండలంలోని దింది కేతిని గ్రామాల మధ్య ఉన్న కల్వర్టుపై వానకాలంలో వరద ప్రవహిస్తుంది. దీంతో కేతీని గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయి. లింగాపూర్ మండలం అల్లిగూడ, ఘుమనూర్ లెవల్ వంతెనలపై వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు పొంగితే కొత్తపల్లి, కాంచనపల్లి, మూలగూడ, ఘుమ్నుర్, మోతిపటర్, వంకమాద్ది, ఫత్కాల్మంగి, బీజలీగూడ, కనకగూడతోపాటు సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. తిర్యాణి మండంలోని వాగులు పొంగి మాణిక్యపూర్, గుండాల, మంగి, కౌటేగాం, మోర్రిగూడ, రోంపల్లి, అర్జున్‌లొద్ది, పండిగి మాదర, చెలిమెలతో పాటు మరో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి.
సింగరేణి నిర్వాసిత గ్రామాలైన ఉల్లిపిట్ట, కోయగూడ గ్రామాలకు ఓసీ మట్టి కొట్టుకువచ్చి ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంటుంది. గ్రామాల్లో మోకాళ్ల లోతు బురద పేరుకుంటుంది. వాంకిడి మండలం గొండ్ కోసార, పిప్పర్‌గొంది, నవేగాం, బనార్ కోసారా, ఖేడేగాంలో వానకాలంలో వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోతాయి. కెరమెరి మండలం సాంగ్వి లో లెవల్ వంతన వద్ద బిడ్జి లేకపోవడంతో సమీప గ్రామాల ప్రజలు వానకాలంలో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిర్పూర్ (యు) మండలం చిన్ననెట్నూర్ చెలుకగూడ, దేవుడ్‌పల్లి రోడ్డు మార్గంలో వంతెన నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది. జైనూర్, రెబ్బెన, దాహెగం, బెజ్జుర్ మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో..
నాగర్‌కర్నూల్ జిల్లాలో దుందుభి నదీ పరీవాహక గ్రామాల ప్రజలు ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. నది పొంగి రహదారులపై ప్రవాహించడంతో రాకపోకలకు ఇబ్బంది పడు తున్నారు. కొల్లాపూర్, సోమశిల ప్రాం తాల్లో చిన్నపాటి వర్షం కురిసినా ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ఏటా ఈ ప్రాంతాల్లో 20 మందికి పైగా కొట్టుకుపోయి ప్రాణాలు వదులుతున్నారు. వాన కాలంలో వాగులుపొంగి కొల్లాపూర్ నియోజకవర్గం ముక్కిడిగుండం, కేమ్యానాయక్ తాండా, మొలచింతలపల్లి వంటి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నా యి. పెద్దవాగు, ఉడుములవాగు, పశువులడొంక వాగులు ఉధృతంగా ప్రవహిం చ డంతో ముక్కిడిగుండంతో పాటు మరో నాలుగు చెంచుపెంటలు వరదలోనే ఉం టున్నాయి.
అచ్చంపేట నియోజకవర్గం మొల్గర బ్రిడ్జి శిథిలం కావడంతో అచ్చంపే ట, కల్వకుర్తి మండల ప్రాంతాల్లో వాహన రాకపోకలు నిలిచిపోతున్నాయి. డిండి చింతపల్లి దుందుభి వాగు ఉప్పొంగితే దేవరకొండ, అచ్చంపేట ప్రాంతాలకు వెళ్లే మార్గాలు జలదిగ్బంధంలో ఉంటున్నా యి. అమ్రాబాద్ మండలం మంద వాగు పొంగితే మద్దిమడుగు దేవాలయ మార్గం నీటమునుగుతున్నది. దుందుభి ఉప్పొంగి తే తిమ్మాజిపేట మాదారం, బోయిన్‌ప ల్లి, సిర్సవాడ, ఊర్కొండ, మిడ్జిల్, కల్వకుర్తి ప్రాం తాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట, తుంగతూర్తి నియోజకవర్గాల్లోని జాజిరెడ్డిగూడెం, తుంగ తుర్తి, నూతనకల్, ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల, మద్దిరాల, మోతే, పెన్‌పహాడ్, మఠంపల్లి, గరిడేపల్లి నూతనకల్ మండలాల్లోని వాగులపై వంతెనలు నిర్మిం చకపోవడంతో సమీప గ్రామాల ప్రజ లు ఏటా వానకాలంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జోరుగా వానలు కురిసినప్పుడు జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం సంగేం రహదారిపై కోడూరు బ్రిడ్జి, సంగెం వద్ద ఉన్న లోబెలెవల్ బ్రిడ్జీపై ఉధృతంగా వాగు ప్రవహిస్తుంది.
దీంతో వారం, పది రోజలు పాటు సమీప గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఇదే రహదారికి అనుసంధా నమైన కొమ్మాల అర్వపల్లి రోడ్డుపై కొమ్మాల వద్ద ఇదే పరిస్థితి ఉంటుంది. తుంగతుర్తి మండలం కేశవాపురం అన్నారం రోడ్డుపై వెలుగుపల్లి సమీపం లో ప్రవహించే బంధం వాగులో ఏటా వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోతాయి. వాగు దాటేందుకు యత్నించి గతంలో ఎంతోమంది మృత్యువాత పడ్డారు. చివ్వెంల మకుందాపురం రహదారిపై నశీంపేట సమీపంలోని వాగు వానకాలంలో ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. ఇటీవల ఇక్కడ వాగుపై బ్రిడ్జీ నిర్మించినప్పటికీ, వరద ఉధృతికి బ్రిడ్జీ ఎలా తట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.






